జలుబు.. దగ్గు.. జ్వరం.. గొంతునొప్పి.. ఎవరి నోట విన్నా.. ఇదే మాట.. వాతావరణంలో ఏర్పడిన మార్పులు..వానాకాలం ప్రారంభంతో గ్రేటర్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా.. ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.
-సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ)
వానా కాలంలో సాధారణంగా గాలిలో తేమ శాతం పెరుగుతున్నది. దీని వల్ల వైరస్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. ఈ క్రమంలోనే గ్రేటర్లో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర ఫ్లూ లక్షణాలతో రోగులు దవాఖానలకు క్యూ కడుతున్నారు. మూడు నాలుగు రోజులుగా నగరంలో ఎవరిని కదిలించినా.. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం కేసులు పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కు గురవడంతో జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడే అవకాశాలున్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
దవాఖానలో పెరుగుతున్న ఓపీ..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణం. ఈ మధ్య కురిసిన వర్షాలతో సీజనల్ కేసులు పెరుగుతున్నాయి. చల్లదనం వల్ల ఎక్కువగా ఫ్లూ కేసులు అంటే జలుబు, జ్వరం వంటి కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు వైరల్ ఫీవర్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయంటున్నారు. దీంతో బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానలు, జిల్లా దవాఖానలతో పాటు ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్స్లో రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇక చిన్నపిల్లలకు సంబంధించి నిలోఫర్ దవాఖానలో సైతం ఈ లక్షణాలతో కూడిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి.
చిన్నా పెద్దా తేడాలేకుండా..
వాతావరణంలో ఏర్పడిన మార్పులతో చిన్నా పెద్దా తేడాలేకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఒంటి నొప్పులు తదితర ఫ్లూ లక్షణాలతో కూడిన సమస్యలతో రోగులు బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు క్యూ కడుతున్నారు.