సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : దీపావళి సందర్భంగా రైళ్లలో ఎలాంటి పేలుడు, లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు నిషేధమని, తీసుకురావద్దని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పేలుడు పదార్థాలపై నిషేధం ఉన్నదని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.
రైళ్లలో, రైల్వే స్టేషన్ల నుంచి ఇలాంటి పదార్థాలు తీసుకెళ్లడంతో తమతో పాటు, తోటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రయాణికుల వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లభించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో పేలుడు పదార్థాలు కనిపిస్తే వెంటనే 139కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.