సిటీబ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరానికి సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, త్వరలో ఆ కల నెరవేరుతుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ కళైసెల్వీ అన్నారు. జీనీ హెల్త్ కనెక్ట్- మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో సహకరిస్తుందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ కళైసెల్వీ అన్నారు. సీసీఎంబీ, బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్, టెక్నాలజికల్ మ్యూజియం ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను వర్చువల్‌గా పాల్గొని ప్రారంభించారు. సీఎస్ఐఆర్ జిజ్ఞాస కార్యక్రమంలో భాగంగా మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. సీఎస్ఆర్ఐ నేతృత్వంలో దేశవ్యాప్తంగా 37 పరిశోధన సంస్థలు పని చేస్తున్నాయన్నారు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్, టెక్నాలజికల్ మ్యూజియం తరహాలో హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేసేందుకు కేంద్రం వద్ద ప్రతిపాదనలు ఉన్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లోని విద్యార్థులకు వైజ్ఞానిక రంగంపై ఆసక్తిని పెంచడంలో సైన్స్ మ్యూజియం సహకరిస్తుందన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 26 సైన్స్ మ్యూజియాలను, రీజినల్ రీసెర్చ్ సెంటర్లను నిర్వహిస్తున్నదని, వాటి ద్వారా సైన్స్, సైంటిఫిక్ రంగంలో జరిగే పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు సైన్స్ మ్యూజియం కృషి చేస్తుందన్నారు. కాగా, బెంగళూరులో ఉన్న సైన్స్ మ్యూజియం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మ్యూజియంలో బయాలజీ, ఫిజిక్స్ వంటి రంగాల్లో శాస్త్రవేత్తల నమూనా ఆవిష్కరణలు, స్పేస్ టెక్నాలజీ, ప్లాంట్ టెక్నాలజీ, కెమికల్ రంగాల్లో జరిగే పరిశోధనల్లో నమూనా లాబోరేటరీలను మ్యూజియంలో పొందుపరిచారు. ఇదే తరహాలో లైఫ్ సైన్సెస్ థీమ్‌తో హైదరాబాద్‌లోని సైన్స్ మ్యూజియం నిర్మాణం జరుగుతుందని సీఎస్ఐఆర్ వర్గాలు పేర్కొన్నాయి.
మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
జన్యుపరంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన అవసరమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సాయంత్రం ఐఐసీటీ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ బస్సును ప్రారంభించారు. ఎయిడ్స్ నియంత్రణకు డ్రగ్‌తోపాటు కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడంలో ఐఐసీటీ ముఖ్య భూమికను పోషించిందని, భారత్ బయోటెక్ వాడుకలోకి తీసుకువచ్చిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఐఐసీటీ సాంకేతికతతోనే రూపుదాల్చినట్లుగా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎన్జీఆర్ డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్, సీఎస్ఐఆర్-హెచ్ఆర్డీ హెడ్ డా.గీతావాణి, వీఐటీఎం డైరెక్టర్ సాధనతోపాటు పలువురు సైంటిస్టులు డా. తంగరాజన్, చండక్, డా. రామానుజ్ నారాయణ్‌తోపాటు పాల్గొన్నారు.