Schools | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : నగరంలో గుర్తింపులేని పాఠశాలలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. పాఠశాలకు గుర్తింపే ఉండదు.. ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తారు. అడ్మిషన్ ఫీజు, బుక్స్, యూనిఫాం, ప్రాజెక్టు తదితర పేర్లతో తల్లిదండ్రుల నుంచి అందనకాడికి లాగేస్తారు. ఏ మాత్రం విద్యాశాఖ నిబంధనలు పాటించకుండా దర్జాగా అడ్మిషన్ల ప్రక్రియ జరుపుతారు. చదువులు చెబుతూ మధ్యమధ్యలో ఫీజుల వసూళ్లు చేపట్టి డబ్బులు సంపాదిస్తారు.
చదువులు చివరికి వచ్చేసారికి ఆ ప్రాంతానికి చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారితో బేరసారాలు జరిపి తమ స్కూల్కు అనుమతి లేదని మీరే చూసుకోవాలని చేతులెత్తేస్తున్నారు. దీంతో అప్పటి వరకు చదువుకున్న విద్యార్థులంతా చెల్లాచెదురవుతున్నారు. అయితే ఇవి చాలా వరకు బయటకు రాకుండానే కొంతమంది విద్యాశాఖ అధికారులు అనుమతి లేని పాఠశాలలతో లాలూచిపడి మేనేజ్ చేస్తున్నారు.
వేరే స్కూల్ పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇలా నగరంలో మొత్తం సుమారు 2374 పాఠశాలలు ఉండగా ఇందులో సుమారు 477 పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. ఈ రాబోయే విద్యా సంవత్సరానికి అయిన విద్యాశాఖ అధికారులు మేల్కొని గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేసి.. గుర్తింపు ఉన్న పాఠశాలల లిస్టును ప్రకటించేల చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అనుమతే ఉండదు.. తగ్గేదేలే అంటారు..!
నగరంలో చాలా స్కూల్స్ తమకు అనుమతి లేకున్నా ఫీజుల వసూల్ల విషయంలో తగ్గేదే లే అంటూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల 800 మంది విద్యార్థులు చదువుతున్న గోల్కొండలోని అర్చిడ్స్ పాఠశాలకు అనుమతి లేదని అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తరహాలో అనేక పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. విద్యాశాఖా అధికారులు దృష్టి సారిస్తే వాటి బాగోతం బయటపడుతుందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఎల్కేజీ చదువుకు ఏడాదికి లక్ష రూపాయలు.. పుస్తకాలకు 15వేలు.. దుస్తులు రూ.5000 వేలు ఇలా ఒక్క విద్యార్థికి చదువు చెప్పడానికి తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ప్రయివేట్ పాఠశాలలు. ఇంత ఫీజు ఏంటని అడిగితే ‘మీ ఇష్టం అడ్మిషన్ రద్దు చేసుకోండి.’ అంటూ ఎదురుదాడితో పేరేంట్స్ను బెదిరిస్తున్నారు.
ఇదెక్కడి అన్యాయం అంటూ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తే సమాధానం ఉండదని బాధితులు చెబుతున్నారు. దీంతో అందినకాడికి దోచెయ్ అన్నట్టుగా పాఠశాలల యాజమాన్యాలు డబ్బులు దండుకోవడానికి పోటీపడుతున్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే రాబోయే అకాడమిక్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగించాయని.. వాటిపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..!
పాఠశాల స్థాపించాలంటే విద్యాశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మద్యం దుఖాణాలు, ప్రార్ధన మందిరాలకు పాఠశాల దూరంగా ఉండాలి. 24 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. భవన రిజిస్టేష్రన్, అగ్ని మాపకం తప్పనిసరి. అయితే నగరంలో చాలా పాఠశాలలను కేవలం లాభార్జన మీదనే నెలకొల్పుతున్నారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తి చేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారని ఫిర్యాదులు అందినా డీఈఓ చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ విషయం విద్యా శాఖాధికాలకు దృష్టిలో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ ప్రమాణాలు పాటించకుండా, వివిధ శాఖల నుంచి అనుమతి తీసుకోకుండా పాఠశాలలను నిర్వహిస్తున్నా తమకు పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.