మేడ్చల్: కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీలు అర్హులకు దక్కుతాయా… లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరుగుతుందా అన్న సందేహాలు దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సానుభూతిపరులకు మొదటి ప్రాధాన్యత అంటూ జరుగుతున్న ప్రచారంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురువుతున్నారు. ఎన్నో పథకాలపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక గత ఏడాది డిసెంబర్లో ప్రజాపాలన పేరిట ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై దరఖాస్తులను స్వీకరించారు. ఏడాది కిందట స్వీకరించిన దరఖాస్తులను సర్వే చేసి గ్యారెంటీల పథకాలకు అర్హులను ఎంపిక చేసి ఈ నెల 26న లబ్ధిదారులకు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో వివిధ పథకాలకు వచ్చిన లక్షల దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా అర్హుల ఎంపిక జరుగుతుందా లేక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడికి అధికారులు తలోగ్గుతారా అన్నది లబ్ధిదారుల ఎంపిక ద్వారా తేలిపోనున్నది.
1,22,043 లక్షల దరఖాస్తులు..
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల నుంచి రేషన్ కార్డుల కోసం 1,22,043 దరఖాస్తులు వచ్చాయి. రేషన్‌కార్డు ఒక వ్యక్తికి ఒకే చోట ఉండాలని, గ్రామీణ ప్రాంతంలో రూ. లక్ష 50 వేల ఆదాయం మించి ఉండరాదని, అర్బన్ ప్రాంతలో రెండు లక్షలకు మించి ఆదాయం ఉండని వారికి కొత్త రేషన్‌కార్డులను జారీ చేసేలా నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే 5,32,938 రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే కొత్తగా ఎంత మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నది ఈ నెల 26న తేలిపోనున్నది.
నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు..
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దారిద్య్రారేఖకు దిగువన ఉన్న గృహలు, ఇండ్లు లేనివారు, నిర్మాణానికి స్థలం ఉన్నవారు, పూరి గుడిసెలో ఉన్నవారు, అద్దె ఇండ్లలో నివాసం ఉన్నవారు అర్హులుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొనగా, భూమిలేని వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నా.. ఆచరణలో ఎంత వరకు అమలు సాధ్యమవుతుందన్న దానిపై అనుమానులున్నాయి. జిల్లాలో మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున ఐదు నియోజకవర్గాల్లో 17,500 వేల ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయనున్నారు. లక్షల్లో దరఖాస్తులు రాగా, నియోజకవర్గానికి 3,500లే ఇస్తే మిగతా లబ్ధిదారులకు రెండో విడతలో ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద జిల్లాలో వెయ్యి మందిని ఎంపిక చేయనున్నారు. ఈ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 21 నుంచి 24 వరకు వార్డు సభలు, గ్రామ సభల్లో జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.