Alugu Varshini | హిమాయత్ నగర్, మే 29 : రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదివే దళిత బాలబాలికలతో పనిచేయించాలని రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల బాలికల సంరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురుకుల విద్యార్థుల పట్ల అవమానకరంగా, కుల వివక్షను ప్రోత్సహించేలా అలుగు వర్షిణి మాటలు ఉన్నాయని మండిపడ్డారు. విద్యార్థులతో టాయిలెట్లు కడిగిoచడం, వంట గదిలో పని చేయడం, గదులను శుభ్రం చేసుకోవాలని చెప్పడమంటే వెట్టి చాకిరితో సమానమని విమర్శించారు. మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన అలుగు వర్షిణి గురుకులాలను మూసివేసి దళిత విద్యార్థులకు విద్య అందకుండా కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యఅందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.