చాదర్‌ఘాట్, నవంబర్ 26,కాటపల్లి టికారాం:స్వీయ రక్షణ…తక్షణ ముప్పును ఎదుర్కోవడానికి మార్షల్ ఆర్ట్స్ సమర్థవంతంగా దోహదపడుతుంది. అందుకేఇటీవల కాలంలో ఆడపిల్లలకు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. ఇలానే ఓ తండ్రి తన కూతురుకు ఆరేండ్ల వయస్సు నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చాడు. ప్రతి రోజు ఉదయం 4గంటలు, సాయంత్రం 4గంటల పాటు శిక్షణ పొందింది. ఈ క్రమంలో లెక్కలేనన్ని గాయాలూ తగిలాయి. అయినా మొక్కవోని దీక్షతో పది సంవత్సరాలుగా క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేస్తున్నది. ఈక్రమంలోనే 14 సంవత్సరాల వయసులోనే బ్లాక్ బెల్ట్సాధించింది. అక్కడితో ఆగకుండా ఎన్నో జాతీయ,అంతర్జాతీయ పోటీల్లో విజయాలను కైవసం చేసుకుంది. మార్షల్ ఆర్ట్స్‌లోని థాయ్ బాక్సింగ్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను కూడా సాధించింది సయేదా ఫరీదా సుల్తానా. ఓ వైపు చదువు… మరో వైపు థాయ్ బాక్సింగ్ శిక్షణ సమప్రాధాన్యం ఇస్తూ దూసుకెళ్తున్న సయేదా ఫరీదా సుల్తానాకు ఇటీవలే ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దాదా సాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డ్ ఆధ్వర్యంలో నారీ శక్తి ఐకాన్ అచీవర్ అవార్డును ఇచ్చి గౌరవించారు.
థాయ్ బాక్సింగ్‌లో అంతర్జాతీయంగా రాణింపు..
సయేదా ఫరీదా సుల్తానా థాయ్ బాక్సింగ్‌లో ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌గా రాణించింది. 2011లో ప్రారంభించిన తన కెరీర్‌ను అంతర్జాతీయ రిఫరీ, జాతీయ గుర్తింపు పొందిన కోచ్ సయ్యద్ ఇఫ్తేకార్ హుస్సేన్ నేతృత్వంలో శిక్షణ పొందింది. 2018లో మొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో ఇసూకూ కరాటే చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. పోటీల్లో విజయపరంపరను కొనసాగిస్తూ మలేషియాలో జరిగిన 6వ లెజెండ్స్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మూడోసారి మెడల్ సాధించింది. అదే విధంగా షార్జా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో కూడా మెడల్ సాధించింది. 2019లో షుకోబాయి ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో గోల్డ్‌మెడల్, రొమానియాలో డబ్ల్యూయూకేఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్, యూఎస్ ఓపెన్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మెడల్‌ను కైవసం చేసుకుంది.
తండ్రి అడుగుజాడల్లో..
సయేదా ఫరీదా సుల్తానాకు తండ్రి సయ్యద్ ఇఫ్తేకార్ హుస్సేనే కోచ్. మలక్‌పేట ప్రాంతానికి చెందిన వీరి కుటుంబంలోని దాదాపు అందరూ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందిన వారే. సయ్యద్ ఇఫ్తేకార్ హుస్సేన్ కూతురు సుల్తానాను అదే బాటలో శిక్షణ కల్పించి థాయ్ బాక్సింగ్‌లో చాంపియన్‌గా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ పోటీల్లో చాంపియన్‌గా ఎన్నో మెడల్స్ సాధించి… ప్రస్తుతం కోచ్, రిఫరీగా సేవలందిస్తున్న ఇఫ్తేకార్ హుస్సేన్ తన శిక్షణ అకాడమీలో తోటి విద్యార్థులతో సమానంగా సయేదాకు తర్ఫీదును ఇస్తున్నాడు. తండ్రి అడుగుజాడల్లో సయేదా ఫరీదా ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొంటూ అనేక చాంపియన్‌షిప్ టైటిళ్లను కైవసం చేసుకుంటున్నది.
ఒలింపిక్‌లోనూ రాణిస్తా..
మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్‌లో సీనియర్ మాస్టర్ సయ్యద్ ఇఫ్తేకార్ హుస్సేన్ వద్ద కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాను. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 4 గంటల పాటు కఠిన శిక్షణ ఉంటుంది. తండ్రి, కోచ్ ఇచ్చిన మద్దతు, మార్గనిర్దేశం, ధైర్యం కారణంగానే కరాటే, థాయ్ బాక్సింగ్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు వచ్చింది. ఒలింపిక్స్ వరకు ఇదే తరహాలో కష్టపడి దేశానికి తప్పకండా పతకం సాధించి తీరుతాననే నమ్మకం ఉంది.