HMDA | తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించింది. సోమవారం మధ్మాహ్నమే ఆయన అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ ఉద్యోగులంతా ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఏర్పాటైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని మినహాయిస్తే చుట్టూ 7 జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించి ఉంది. హెచ్ఎండీఏలో గత నెలలుగా అభివృద్ధికి, కొత్త ప్రాజెక్టులకు నోచుకోలేదు. పైగా గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టారు. ఫలితంగా హెచ్ఎండీఏ భవిష్యత్తు ఏమవుతుందా? అని ఆ సంస్థ ఉద్యోగుల్లోనే ఎంతో ఆందోళన నెలకొంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హెచ్ఎండీఏ చైర్మన్‌గా, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్నా ఆరు నెలలుగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
గత ప్రభుత్వంలో హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వేల కోట్లతో ప్రాజెక్టులను చేపట్టి, నగరానికి ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. అలాంటి హెచ్ఎండీఏలో ఆరు నెలలుగా ప్రభుత్వం చేసిందేమీ లేదని, తామంతా ఖాళీగా ఉన్నామని, ప్రాజెక్టులు చేపట్టేందుకు డబ్బులు ఇవ్వడం లేదని వాపోయేవారు. పూర్తి స్థాయి కమిషనర్ వస్తేనే హెచ్ఎండీఏకు పూర్వ వైభవం వస్తుందని, భారీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దశ తిరుగుతుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేసేవారు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరగాలంటే పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు మెట్రోపాలిటన్ కమిషనర్ అవసరమని పట్టణ ప్రణాళిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.