సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): గంజాయి ప్యాకెట్లు పెట్టాల్నా.. డ్రగ్స్ పెట్టి పట్టించాలా.. ఏం రా పార్టీ మీటింగ్‌కు రమ్మంటే వస్తలేవు.. ఏం తమాషాలు చేస్తున్నావా.. కాంగ్రెస్ పార్టీలోకి రాకుంటే నీ అంతు తేలుస్తా.. పార్టీ మారాలె.. లేకపోతే సీరియస్‌గా ఉంటది.. ఇది బోరబండ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు దివంగత మహ్మద్ సర్దాన్‌ను బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బెదిరించిన తీరు. అధికార కాంగ్రెస్ అండదండలతో ఆ పార్టీ అరాచకత్వానికి నిదర్శనంగా ఈ హెచ్చరికలు నిలుస్తున్నాయి. సర్దార్ పార్టీ మారకపోతే తన అధికారబలంతో ఏదైనా చేస్తానంటూ చేసిన బాబా హెచ్చరికల వెనక అధికారపార్టీ నేతలే ఉన్నారనేది సుస్పష్టం.
తనకు ప్రాణభయం ఉంద ని, తనను రక్షించాలని కోరు తూ సర్.. హెల్ప్‌మీ.. అంటూ సర్దార్ తాను మరణించే ముందు సీఎం రేవంత్‌రెడ్డికి మెయిల్ చేశారు. అయినప్పటికీ సీఎం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా కనీసం ఈ విషయంలో పోలీసులను కూడా ఆయన అప్రమత్తం చేసి వారి ద్వారా వివరాలు తీసుకోలేకపోవడంతో బాబా అరాచకాలకు కాంగ్రెస్ నేతలనుంచి అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. కర్ణాటక నుంచి వచ్చి బోరబండ ఎస్ఆర్టీనగర్లో మెడికల్‌షాపును నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన సర్దార్‌ను పార్టీ మారాలని బెదిరించడంతో పాటు బాబా అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తూ తన ఇంటికి డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పిన సర్దార్ ఇంటిని కూల్చేసిన కారణంగా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నవంబర్‌లో తన తమ్ముడి వివాహం ఉన్నదని చెప్పినా వినకుండా తనను బెదిరిస్తూ చేసిన హెచ్చరికలతో సర్దార్ ఆందోళన చెంది మూడో అంతస్తుపైనుంచి కిందకు దూకి చనిపోయాడు. ఈ ఘటనకు ముందు సీఎం రేవంత్‌రెడ్డికి సర్దార్ తనకు ప్రాణభయం ఉందని మెయిల్ చేసినా ఏం ఫలితం లేదు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కుటుంబసభ్యులు పోలీసులకు, మీడియాకు అందించారు. ఎవరెన్ని చెప్పినా తమ అధికారం ముందు అన్నీ బలాదూరే అన్నట్లు కాంగ్రెస్ బడానేతలు వ్యవహరిస్తూ సర్దార్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.
మే నెలలో జరిగిన ఈ ఘటన తర్వాత సర్దార్ కుటుంబం ఒంటరైంది.34ఏళ్ల వయసులోనే సర్దార్కు నూరేళ్లు నిండడానికి ఒకరకంగా కాంగ్రెస్ నేతల నియంతృత్వ ధోరణే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆయన భార్య, మూడేళ్ల చిన్నారి, ఒకటిన్నర సంవత్సరం ఉన్న చిన్నారితో పాటు వృద్ధురాలైన తల్లి ఒంటరిగా మిగిలిపోయారు. ఆయనను బెదిరించిన ఆడియోలు బయటపెట్టినా పోలీసులు ఏ చర్యలూ తీసుకోలేదని, సర్దార్ది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ కుటుంబసభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.అయినా సర్కార్ మాత్రం బాబాఫసియుద్దీన్ చర్యలకు మద్దతుగా నిలిచింది.
ఫసియుద్దీన్ అరాచకత్వానికి కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు లేకపోగా కంటితుడుపు చర్యగా బాబాపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉందని పోలీసులు చెబుతున్నప్పటికీ బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలు ఇచ్చినా బాబాను ఎందుకు శిక్షించడం లేదంటూ స్థానికులు, కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలే వెనకుండి అంతా నడుపుతున్నారని, పోలీసులపై వారి ఒత్తిడి ఉందని తెలుస్తోంది.
అడిగినంత మామూళ్లు ఇవ్వలేదన్న కక్షతో సర్దార్ ఇంటిని మున్సిపల్ అధికారులతో కూల్చివేయించి.. బెదిరింపులకు దిగి అతడి బలవన్మరణానికి కారణమైన కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతగా దౌర్జన్యాలు, దుర్మార్గాలకు ఒడికట్టిన బాబాను పార్టీనుంచి సస్పెండ్ చేస్తారేమోనని ఆ పార్టీవారే ఎదురుచూశారు. అయినా బాబాపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆ పార్టీ దుష్ట సంస్కృతికి పరాకాష్టగా నిలుస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బాబా వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డ సర్దార్ మృతిపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా కదలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు బాబాఫసియుద్దీన్ను కలిశారంటే కాంగ్రెస్ వైఖరేంటనేది అర్థమవుతున్నదని, అరాచకవాదులను అందలమెక్కించే కాంగ్రెస్ ఈ సంఘటనలో బాధ్యులను భుజానికెత్తుకుంటున్నారంటే ఆ పార్టీ చిత్తశుద్ధి ఏంటో తేటతెల్లమవుతోంది. తాజాగా ఫసియుద్దీన్‌ను మళ్లీ చెలరేగిపోవాలంటూ హస్తం నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బోరబండలో మరోసారి అరాచకత్వం జడలు విప్పుకుంటుందని, అధికారమే తన చేతిలో ఉండడం, తనకు పెద్ద నేతలు మొదటినుంచి వెనకున్నారన్న అధికారగర్వంతో బాబా మళ్లీ రెచ్చిపోతాడని స్థానికులు అంటున్నారు.
తన కొడుకును కాంగ్రెస్ వాళ్లే చంపేశారని, సర్దార్ మరణంతో మా కుటుంబం ఒంటరైపోయిందని , తన కొడుకు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనంటూ సర్దార్ తల్లి ఫాతిమాబాను రోదిస్తూ తెలిపారు. పోలీసులు ఇంతవరకు ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె చెప్పారు. తన కొడుకును పార్టీ మారాలని ఫసియుద్దీన్ బెదిరించారని, అయితే బట్టలు మార్చుకున్నంత తేలికగా పార్టీ మారనంటూ సర్దార్ చెప్పడంతో అతడిని బాబా వేధించారని ఫాతిమాబాను తెలిపారు. తమను బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ఆదుకున్నారని, వారు మా కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు. తమ కొడుకు మరణానికి కారణమైన వారిని కాంగ్రెస్ నేతలు కాపాడుతున్నారంటూ, ఇదేం అరాచకమంటూ సర్దార్ తల్లి ఫాతిమాబాను ఆగ్రహం వ్యక్తం చేశారు.