కాంగ్రెస్ సర్కారు ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన సారథి పోర్టల్ వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నది. సర్వర్లు మొండికేయడం.. స్లాట్ బుక్ చేసేందుకు అరగంటకుపైగా ఆలస్యం కావడం.. దరఖాస్తులు అప్‌లోడ్‌లో ఇబ్బందులు చికాకు తెప్పిస్తున్నాయి. పైగా ఒక్క లెర్నింగ్ లైసెన్స్ బుక్ చేసుకోవాలంటే..నాలుగైదు క్యాప్చాలు ఎంటర్ చేయాల్సి రావడంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సారథి సేవలపై వాహనదారులు పెదవి విరుస్తున్నారు.
-సిటీబ్యూరో, మే 3 ( నమస్తే తెలంగాణ)
Sarathi Portal | కాంగ్రెస్ సర్కార్ ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా సారథి పోర్టల్ సేవలను ప్రారంభించింది. రాష్ట్రంలో మొదటి పైలెట్ ప్రాజెక్టుగా సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయంలో సేవలు మొదలయ్యాయి. అయితే సారథి సేవలు పొందాలంటే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏదైనా స్లాట్ బుక్ చేసుకోవాలన్నా.. ఫీజులు చెల్లించాలన్నా సర్వర్లు మొరాయిస్తున్నాయి. గతంలో రెండు, మూడు నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ అయితే ఇప్పుడు ఏకంగా 20 నిమిషాలకు పైగా సమయం పడుతున్నదని వాహనదారులు వాపోతున్నారు.
ఒక్క లెర్నింగ్ లైసెన్స్ బుక్ చేసుకోవాలనుకుంటే నాలుగు, ఐదు క్యాప్చాలు ఎంటర్ చేయాల్సి వస్తున్నదని, దీంతో పాటు ప్రమాదాల నివారణపై మూడు నిమిషాల వీడియో వీక్షించాల్సి ఉంటుందని వివరించారు. వీడియో సమయం సరైనదే అయినప్పటికీ మిగిలిన అన్ని క్యాప్చాలు ఎంటర్ చేయడం అనవసరమేనని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు స్లాట్ బుకింగ్‌లో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి ఎర్రర్స్ వస్తున్నాయి. దీంతో చాలా మంది వాహనదారులు సారథి పోర్టల్ వినియోగంపై పెదవి విరుస్తున్నారు.
తిరుమలగిరి కార్యాలయంలో సారథి వెబ్ పోర్టల్ పనితీరుపై అధికారులకు సమగ్ర శిక్షణ అవసరం ఉన్నది. సిబ్బంది సైతం గతంలో కాకుండా ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సారథి పోర్టల్ మిగిలిన రవాణా శాఖ కార్యాలయాల్లో ఇప్పట్లో అమలు చేసేలా కనిపించడం లేదు. ఇప్పటికే చాలా రావాణా శాఖ కార్యాలయాల్లో పాత కంప్యూటర్లు, కొన్ని చోట్ల సరిపడా లేకపోవడం, సారథి అమలు చేస్తే సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికే మూడు నెలల సమయం పడుతుండటం తదితర కారణాలతో సారథి సేవలు ఆలస్యం కానున్నట్టు అధికారులు చర్చించుకుంటున్నారు.