జూబ్లీహిల్స్,జూన్18 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. సమస్యల రహిత డివిజన్లుగా తీర్చిదిద్దేందుకు బస్తీలు, కాలనీల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ అధ్యక్షతన కమలాపురి కాలనీ సంక్షేమ సంఘం కార్యాలయ ప్రాంగణంలో సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ డివిజన్ల సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.