సైదాబాద్, ఫిబ్రవరి 25 : శంకేశ్వరబజార్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీటి, రోడ్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని శంకేశ్వరబజారులో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ, జలమండలి డీజీఎం షీలారాణి, జీహెచ్ఎంసీ ఏఈ వెంకన్నతో కలిసి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ప్రజలు డ్రైనేజీ, తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నిధులను వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం డ్రైనేజీ పైప్‌లైన్‌ను పూర్తిగా తొలగించి దాని స్థానంలో పెద్ద సైజ్‌లో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని, దీంతో డ్రైనేజీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. చాలా ఇండ్లకు తాగునీరు సరఫరా కావడంలేదని, వచ్చే నీరు కూడా లోప్రెషర్‌తో సరఫరా కావటంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్పారని, తాగునీరు సరఫరా సక్రమంగాలేని ప్రాంతాల్లో కొత్త తాగునీటి పైప్లైన్లను వేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల పనులు పూర్తి కాగానే అన్ని ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేయటానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ఏఈ వెంకన్నగౌడ్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆస్మాన్‌ఘడ్ జలమండలి డీజీఎం షీలారాణి, సైదాబాద్ మేనేజర్ శ్రవణ్, జీహెచ్ఎంసీ ఏఈ వెంకన్నగౌడ్, బీజేపీ నాయకులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, చిల్కూరి రాంరెడ్డి, ఎడవెల్లి నర్సింహ, సుమంత్‌గౌడ్, నాగరాజ్ గౌడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.