కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 17 : పారిశుధ్య కార్మికులు బాధ్యతగా పనిచేయాలని వందశాతం స్వచ్ఛతను సాధించేలా కృషి చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శనివారం మూసాపేట సర్కిల్లోని బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీల్లో జడ్సీ మమత ఆకస్మిక తనిఖీలు చేశారు. పారిశుధ్య కార్మికుల హాజరు పట్టికను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో పనితీరును తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన పారిశుధ్య కార్మికులకు, ఎస్ఎఫ్ఏకు, ఏఎంహెచ్వోలకు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, పర్యవేక్షణ సిబ్బంది బాధ్యతగా పనిచేస్తేనే వందశాతం స్వచ్ఛతను సాధించవచ్చన్నారు. కొందరు కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల లక్ష్యం నెరవేరడం లేదన్నారు. పారిశుధ్య కార్మికులంతా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బాధ్యతగా పనిచేయాలన్నారు. అప్పగించిన ప్రాంతాల్లో రోడ్లన్నీ పరిశుభ్రంగా మార్చాలని.. తరచుగా చెత్త వేస్తున్న ప్రాంతాలను గుర్తించి స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్య కార్మికుల పనితీరును గమనించి హాజరు వేయాల్సిన ఎస్ఎఫ్ఏలు వారికి కేటాయించిన ఏరియాలోనే ఉండి పని చేయాలన్నారు.
ఎస్ఎఫ్ఏకు కేటాయించిన ఏరియాలో పబ్లిక్ టాయిలెట్లు, జీవీపీ పాయింట్లు, స్వచ్ఛ ఆటోలను పరిశీలించాలన్నారు. పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోయినా.. జీవీపీ పాయింట్లలో చెత్తాచెదారాన్ని సకాలంలో తొలగించకున్నా.. స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించకున్నా వెంటనే మొబైల్ యాప్‌లో సమాచారాన్ని అందించాలన్నారు. ఎస్ఎఫ్ఏలు నిర్ణయించిన సమయాల్లోనే పారిశుధ్య కార్మికుల హాజరు తీసుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికులు సరిగా పనిచేయకుంటే సమాచారమివ్వాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికులతోపాటు ఎస్ఎఫ్ఏలు, ఎస్ఆర్పీలు క్షేత్రస్థాయిలో ఉంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
ఆకస్మిక తనిఖీలు తరచుగా ఉంటాయని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారిశుధ్య కార్మికులకు రూ.100, ఎస్ఎఫ్ఏకు రూ.500 జరిమానా, ఏఎంహెచ్వోకు మెమోను అందిస్తున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఏఎంహెచ్‌వో వెంకటరమణ, ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.