సిటీబ్యూరో, మార్చి 10 ( నమస్తే తెలంగాణ ) : సామాజిక సేవ చేయడానికి ఎంతమంది ముందుకొస్తారు? వచ్చినా పబ్లిసిటీ కోసం తాపత్రాయపడే వాళ్లే అధికం. ఆ సేవలోనూ తమ లాభమే చూసుకునే సంస్థలూ ఉన్నాయి. కానీ కేవలం ఇంటినే కాదు.. మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని నినదించే వాళ్లూ ఉన్నారు. ప్రతిరోజు రోడ్లు, కాలనీలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల సేవలను గౌరవించాలంటూ నినదిస్తున్నారు.
సేవకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. వాళ్లే హ్యాపీ హైదరాబాద్, శ్రీగణేశ్ యువసేన, హెచ్‌సీజీ గ్రూప్ సభ్యులు. కొందరు నగరంలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని దారుల వెంట చెత్తను శుభ్రం చేస్తే.. మరికొందరు పారిశుధ్య కార్మికుల కోసం ఎదురుచూడకుండా తమ వంతుగా వ్యర్థాలను డస్ట్బిన్లలో వేద్దాం అని చాటుతున్నారు.
ఇంకొందరూ చెరువులను ఎంపిక చేసుకుని చెత్తను తొలగిస్తున్నారు. ఇలా ప్రతి వారంలో మూడు రోజులు వాళ్లంతా సేవలో నిమగ్నమవ్వడం విశేషం. ఈ సేవలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆదర్శంగా నిలుస్తున్నారు. 75 ఏండ్ల పైబడిన విజయనాయుడు, శ్రీలక్ష్మి ఆదివారం తిరుమలగిరిలో పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు.