బల్దియాలో పొరుగు సేవల ఇంజినీర్లు జీతాలు అందక అవస్థలుపడుతున్నారు. రెండు నెలలుగా వేతనాలు అందక.. అప్పుల తిప్పలు పడలేక వారు ఆవేదనతో సోమవారం మూకుమ్మడిగా జీహెచ్ఎంసీకి వందలామంది ఇంజినీర్లు తరలివచ్చారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ప్రధాన కార్యాలయం సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు.
సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో గడిచిన ఐదేండ్లుగా న్యాక్ ద్వారా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 250 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ఎన్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, హౌసింగ్ ఇతర విభాగాల్లో వీరికి ఆయా పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వీరి ఒప్పంద గడువును ప్రతి ఏటా పెంచుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి ఒప్పంద గడువు గత అక్టోబరు నెలాఖరుకు ముగిసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ పేరుతో వీరి ఒప్పంద గడువును మళ్లీ పొడగించకుండా గడిచిన రెండు నెలల పాటు పని చేపిస్తూ వచ్చిన అధికారులు ..వీరికి నెలవారీ వేతనాల విషయంలో కనికరం చూపలేదు. సాంకేతిక కారణాలతో ఫైనాన్స్ విభాగం నుంచి వీరికి జీతాలు ఇచ్చేందుకు వీలు పడలేదు. అయితే ఇక్కడే శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది. అడ్మిన్ విభాగం ముందస్తుగా వీరి సేవలు అవసరం అనుకుంటే ఎప్పటిలాగే గడువును పెంచుకుని జీతాలు ఇచ్చేలా చొరవ చూపాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఒప్పంద అంశాన్ని దాచి పెట్టి సదరు ఇంజినీర్లతో పనులు జరుపుకొంటూ వచ్చింది.
ఉప ఎన్నికల కోడ్ ముగిసినా వీరికి జీతాలు రాకపోవడం, రోజుల తరబడి అదిగో ఇదిగో అంటున్నారే తప్ప.. జీతాలు ఇవ్వడం లేదంటూ ఏకంగా ప్రధాన కార్యాలయంలో తమ బాధను చెప్పుకొనేందుకు మూకుమ్మడిగా ఇంజినీర్లంతా వచ్చారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఈఎన్సీ భాస్కర్‌రెడ్డిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని చెప్పడంలో సదరు ఇంజనీర్లు వెనుతిరిగారు. ఒకప్పుడు కామధేనువులా నిధులు కురిపించిన జీహెచ్ఎంసీ నేడు కనీసం ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరడం పట్ల తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులు రూ.వేల కోట్లలో పెండింగ్‌లో ఉంటే, ఇప్పుడు కనీసం పనిచేసిన ఇంజనీర్ల వేతనాలకూ నిధులు లేకపోవడం బల్ధియా దివాలా తీసిందనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.