Sahasra Murder | హైదరాబాద్ : కూకట్‌పల్లికి చెందిన పదేండ్ల సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపినట్లు బాలుడు అంగీకరించినట్లు సమాచారం. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లోనే ఆ బాలుడు ఉంటున్నాడు. దొంగతనానికి వెళ్లే ముందు ఒక ప్రణాళికను రచించుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. చోరీకి వెళ్ళేటప్పుడు తన వెంట కత్తి తీసుకెళ్లాడు. సహస్ర తల్లిదండ్రులు బయటికి వెళ్లిన తర్వాత, ఇంట్లోకి చొరబడి రూ.80 వేలు దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తుండగా బాలుడిని చూసి సహస్ర కేకలు పెట్టింది. దీంతో దొరికిపోతానని భావించిన బాలుడు.. ఆమెపై కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోసి కింద పడిపోయిన సహస్ర కడుపులో 18 కత్తిపోట్లు పొడిచాడు. అనంతరం పక్క బిల్డింగ్ లోకి దూకి పదిహేను నిమిషాల పాటు తల దాచుకున్నాడు. అయితే బాలుడు పారిపోతుండగా.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గమనించి, పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో సహస్ర హత్య వెలుగు చూసింది. ప్రస్తుతం బాలుడు కూకట్పల్లి పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.
దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్క ప్లాన్‌తో ఒక పేపర్‌పై ప్రణాళికను రాసిపెట్టుకున్నాడు. హౌ టూ ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ రాసుకున్నాడు. ఈ పేపర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈ కేసు విచారణలో భాగంగా బాలుడు పలు కట్టుకథలు చెప్పాడు. కానీ చివరకు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. నోరు విప్పకపోవడంతో బాలుడి ఇంట్లో తనిఖీలు చేయగా కత్తి, రక్తపు గుర్తులతో ఉన్న బట్టలు లభ్యమవడంతో అవి స్వాధీనం చేసుకొని బాలుడిని అరెస్టు చేసి విచారించగా నిజాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.