కృష్ణా నీరు తరలింపు సవాలే
గ్రేటర్ ప్రజల దాహార్తిలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా నగరానికి రోజూ 270 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ పర్ డే) నీటిని జలమండలి అందిస్తున్నది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద నీరు లేదు.
- సాగర్‌లో507 అడుగుల మేర నీటి నిల్వలు
- 500 అడుగులకు పడిపోతే..ఇబ్బందే
- జూలై దాటితే బార్జ్ టెక్నాలజీతో రెండో విడుత పంపింగ్.. అధికారుల వెల్లడి
- సకాలంలో వరదలు ప్రారంభం కాకపోతే నగర తాగునీటిపై తీవ్ర ప్రభావం
సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ ప్రజల దాహార్తిలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా నగరానికి రోజూ 270 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ పర్ డే) నీటిని జలమండలి అందిస్తున్నది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద నీరు లేదు. శ్రీశైలం, సాగర్ కలిసినా 12.86 టీఎంసీల నీటి కొరత ఏర్పడింది.
దీనికి తోడుగా రెండు రాష్ర్టాల నీటి అవసరాలు… ముఖ్యంగా ఏపీ ధోరణితో ప్రస్తుతం సాగర్‌లో 507 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో సాగర్ నీటి నిల్వ 524 అడుగుల మేర ఉండగా..ఈ సారి నీటి మట్టం డెడ్ స్టోరేజ్ చేరింది. ఈ ప్రభావం హైదరాబాద్ తాగునీటిపై పడకుండా ఉండేందుకు ఏడేండ్ల తర్వాత జలమండలి అత్యవసర పంపింగ్‌కు రూ. 3 కోట్లు ఖర్చు చేశారు. సాగర్ ఫోర్‌షోర్‌లో 10 అత్యవసర మోటర్లు (స్టాండ్ బై 4 మోటర్లు)ఏర్పాటు చేసి, నగరానికి రోజూ మూడు దశల్లో 270 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్ పర్ డే) చొప్పున నీటిని తరలిస్తున్నారు.
పుట్టగండి అప్రోచ్ కెనాల్ ద్వారా..
సాగర్ జలాశయంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టగండి అప్రోచ్ కెనాల్ ద్వారా దాదాపు 9.2 కిలోమీటర్ల మేర నీటిని పంపు చేసి.. అక్కంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు. అక్కంపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.5 టీఎంసీ (అంటే నెలకు సరిపడా నీటి నిల్వ) ఉండగా, ప్రస్తుతం 1 టీఎంసీల మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే సాగర్ నీటి నిల్వల అంశానికి వస్తే 500 అడుగుల వరకు ఇప్పుడున్న పంపింగ్‌కు ఎలాంటి ఢోకా లేదు. 12 టీఎంసీల మేర నీరు ఉన్నప్పటికీ లాసెస్ (మండుతున్న ఎండలతో నీటి ఆవిరి, ఇతర )పోతే 9 టీఎంసీల మేర నగర తాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు.
జూలై చివరి నాటికల్లా..
మిషన్ భగీరథతో పాటు నగర తాగునీటికి నెలకు 1.5 టీఎంసీల నీటిని వాడితే ఐదు నెలలకు పైబడి నగర తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నప్పటికీ జూలై చివరి నాటికల్లా 500 అడుగుల లోపు నీటి నిల్వలు పడిపోతే బార్జ్ టెక్నాలజీని ఉపయోగించి రెండో విడతగా అత్యవసర పంపింగ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు రెండు నెలలకు ముందస్తుగానే ఈ పంపింగ్ ఏర్పాట్లు చేస్తామని పేర్కొంటున్నారు.
మొత్తంగా తొమ్మిది టీఎంసీలలో 6 టీఎంసీల నీటి తరలింపులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ఆ తర్వాతనే నీటి తరలింపు మరింత కష్టసాధ్యమవుతుందన్న వాదనల నేపథ్యంలో జూలై, ఆగస్టు మాసంలో కృష్ణా జలాల తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నాగార్జునసాగర్‌కు జూలై, ఆగస్టుల్లో వరదలు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సారి కొంచెం ఆలస్యమైతే పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన నెలకొన్నది. రెండో విడత అత్యవసర పంపింగ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారన్నది చూడాలి.
సరిగ్గా ఏడేండ్ల తర్వాత ..
నాగార్జున సాగర్ నుంచి అత్యవసర మోటర్ల ద్వారా నగరానికి నీటి తరలింపు జలమండలికి కొత్తేమి కాదు..కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టిన సందర్భంలో సాగర్ నుంచి అత్యవసర పంపింగ్ ద్వారా అక్కంపల్లికి.. అక్కడి నుంచి కోదండపూర్ ..నాసర్లపల్లి, గోడకొండ్ల..గునగల్..సాహేబ్‌నగర్ వరకు కృష్ణా జలాలను మూడు దశల్లో నగరానికి రోజూ 270 ఎంజీడీలను చేర్చుతున్నారు.
అక్కంపల్లిలో 1.5 టీఎంసీల నీరు స్టోరేజీ నిత్యం ఉంచుతారు. నీటి తరలింపులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా…అక్కంపల్లిలో నిల్వ ఉన్న నీరు నెల రోజుల వరకు సరిపోతుంది. అయితే అత్యవసర తరలింపు ప్రక్రియ సరిగ్గా 2017 లో దాదాపు 120 రోజుల పాటు నడిపించారు. ప్రస్తుతం అత్యవసర పంపింగ్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక సబ్స్టేషన్లతో విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
సిటీకి కృష్ణా జలాల తరలింపులా..
- గ్రేటర్‌కు 138 కి.మీ దూరంలో ఉన్న అక్కంపల్లి జలాశయం నుంచి నిత్యం మూడు దశల పంపింగ్ ద్వారా 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను రాజధానికి తరలిస్తున్నారు.
- అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 34 కి.మీ దూరంలోని కోదండాపూర్‌కు గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. అక్కడ శుద్ధి చేసి 353 మీటర్ల ఎత్తున లిఫ్టు ద్వారా నాసర్లపల్లికి పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నీటిని శుద్ధి చేసి 495 మీటర్ల ఎత్తున లిఫ్టు చేసి.. 20 కి.మీల దూరంలో ఉన్న గోడకండ్ల రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు.
- గోడకండ్ల రిజర్వాయర్ నుంచి 618 మీటర్ల ఎత్తున లిఫ్టు చేసి 31 కి.మీ దూరంలో ఉన్న గున్గల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు… అక్కడి నుంచి 29 కి.మీ దూరంలో ఉన్న సాహేబ్‌నగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి రింగ్ మెయిన్ పైపులైన్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు. పాతనగరంతో పాటు ఎల్బీనగర్, రాజేంద్రనగర్, ఉప్పల్, మలక్‌పేట, మహేశ్వరం, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలు లబ్ధిపొందుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

