ఖైరతాబాద్, అక్టోబర్ 19 : ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం, మంగళారపు చౌదరి యాదయ్య అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపు(సోమవారం) సదర్ సమ్మేళన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 1946లో అప్పటి నిజాం నవాబు కాలంలో 18 చోట్ల సదర్ ఉత్సవాలు నిర్వహించేందుకు ఒకరికి బాధ్యతలు అప్పగించి ఆయనకు చౌదరిగా నామకరణం చేశారని, అదే పరంపర 80 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నామన్నారు.
ఈ నెల 21న రాత్రి 7గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అమీర్‌పేట్, ఆనంద్‌నగర్ కాలనీ, చింతలబస్తీ, చాదర్‌ఘాట్, దోమలగూడ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అలకరించిన 50 దున్నపోతులను తీసుకువస్తున్నామని, ఖైరతాబాద్ రైల్వే గేటు నుంచి బడా గణేశ్ ప్రాంగణం వరకు ర్యాలీ, విన్యాసాలు నిర్వహిస్తామన్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు మహేశ్ యాదవ్, మధుకర్ యాదవ్, దుర్గా ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.