బడంగ్‌పేట, సెప్టెంబర్ 3: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు, పాలకవర్గ సభ్యులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. టెండర్ వేయకుండా పనులు చేయకూడదనే నిబంధనలను పట్టించుకోవడంలేదు. టెండర్లు మూడు రకాలుగా వేసేందుకు అవకాశం ఉంది. కానీ, టెండర్ వేయకుండానే పనులు చేయడానికి వీలు లేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
డివిజన్ల వారీగా చేయాల్సిన అభివృద్ధి పనుల జాబితాను పొందుపర్చిన తర్వాతే.. అధికారులు ఎజెండాను రూపొందిస్తారు. ఆ ఎజెండాలో ఉన్న అంశాలను కౌన్సిల్లో సభ్యులు చర్చించిన తర్వాతే.. మోజార్టీ సభ్యులు ఆమోదం తెలిపిన తర్వాత తీర్మానం చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. టెండర్ వేయకుండానే కోట్ల రూపాయల పనులు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఇంజినీరింగ్ అధికారుల మాయాజాలం..
బడంగ్‌పేటలో ఇంజినీరింగ్ విభాగం అధికారుల మాయాజాలం నడుస్తోంది. డీఈలు, ఏఈల మాటే వేదంగా మారింది. ఇక్కడ పనుల విషయంలో ఎజెండా తయారు చేయనవసరం లేదు. కౌన్సిల్లో తీర్మానాన్ని ఆమోదించకపోయినా పర్వాలేదు.. టెండర్ వేయకపోయినా సరే.. కోట్ల రూపాయల పనులు ముందస్తుగానే చేయించడంలో ఇక్కడి అధికారులు ముందుంటారు.
పాలకవర్గంలో కొంత మంది నేతలు చెప్పిందే తడువు ఇంజినీరింగ్ అధికారులు అన్ని చక్కబెడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి.. కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు తీర్మానాలు, కౌన్సిల్ ఆమోదం, టెండర్ ప్రక్రియ లేకుండానే చక చక చేసేస్తున్నారు. పనులు చేసిన తర్వాత ఎజెండాలో చేర్చడం.. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆమోదం తెలపడంతో తీర్మానం అయినట్లు రాసుకుంటున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న డీఈలు, ఏఈల చలవతో ఈ వ్యవహారం నడుస్తోందన్న విమర్శలున్నాయి.
పూర్తయిన పనులకు టెండరా..?
ఇప్పటికే పూర్తయిన పనులకు టెండర్ ఎలా వేస్తారన్న అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నెల 16న బడంగ్‌పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ 17లో పనులకు రూ.15 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎజెండాలోని అంశం నంబర్ 1, క్రమసంఖ్య 197లో పొందుపర్చారు. శివాజీ చౌక్ నుంచి గణేశ్ చౌక్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. ఎలాంటి టెండర్ లేకుండానే పనులు చేపట్టారు. ఐదో డివిజన్ నుంచి విజ్ఞాన్‌పురి వరకు డ్రైనేజీ పనులు పూర్తి చేసిన తర్వాత ఈ నెల 16న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి తీర్మానం చేశారు.
అసలు విజ్ఞాన్‌పురి కాలనీ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేదు. అయినా కూడా పూర్తయిన పనులకు టెండర్ ఎలా వేస్తారని కొంత మంది కార్పొరేటర్లు సైతం పెదవి విరుస్తున్నారు. డీఈ జ్యోతి మాత్రం.. లక్ష లోపు ఉన్న పనులను మాత్రం ముందస్తు చేయిస్తాం.. రూ. లక్ష దాటితే టెండర్ వేయకుండా పనులు చేయించమని చెబుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఒకే ఒక వ్యక్తి చెప్పిందే వేదంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులైనా, ప్రజా ప్రతినిధులైనా ఆయన మాట వినాల్సిందే.
ప్రజాధనం దుర్వినియోగం..
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని కౌన్సిల్ సమావేశంలో ఓ కార్పొరేటర్ తీవ్ర అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం. సంబంధంలేని అంశాలను ఎజెండాలో చేర్చడంపై సభలో గందరగోళం జరిగినా.. తీర్మానాలు చేసి ఆమోదం తెలిపారు. పెట్టిన బిల్లులు రీపిట్ కావడంపై కొంతమంది సభ్యులు అభ్యంతరాలు చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని కొంత మంది కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా బిల్లులు పెడుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ వ్యవహారమంతా పై అధికారులకు తెలియకుండా కిందస్థాయి అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.
లక్ష దాటితే టెండర్ వేయాల్సిందే: డీఈ జ్యోతి రెడ్డి
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో రూ. లక్ష దాటేతే తప్పని సరిగా టెండర్ వేయాలి. టెండర్ వేయకుండా పనులు చేయడానికి లేదు. అలాంటివేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలి. పరిశీలిస్తాం. లక్షలోపు పనులు చేయిస్తాం. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతాయి. తప్పు ఎక్కడా జరగదు.
ఆనవాయితీగా వస్తున్నది: కమిషనర్ రఘు కుమార్
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ముందుస్తుగా పనులు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఎలా చేయిస్తున్నారో.. అంతా ఇంజినీరింగ్ అధికారులు చూసుకోవాలి. టెండర్ లేకుండా రూపాయి పని కూడా చేయడానికి వీలు లేదు. టెండర్ మూడు రకాలుగా వేయవచ్చు. ముందస్తుగా పనులు ఎక్కడ చేశారో తెలుసుకుంటాను. ఇప్పటి వరకు తన దృష్టికి రాలేదు.