మల్కాజిగిరి : ప్రజలకు ఇబ్బందులు రాకుండా రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Marri Rajasekhar Reddy) అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి రైల్వే అధికారులతో కలసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలోని ప్రజలకు రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఎం జగదీష్, ఏడీఎం రవిప్రకాష్, పాజెక్ట్ ఆఫీసర్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో ఇన్చార్జి డీసీ మల్లారెడ్డితో కలసి ప్రజల సమస్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు(CC Roads) , బీటీ రోడ్లు, బాక్స్ డ్రైనేజీ, డ్రైనేజీ పనులు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే ప్రారంభించాలని కోరారు. నల్లా కనెక్షన్లను మంజూరు చేసి నీటి సరఫరా(Water Supply) ను మెరుగు పరచాలని, వరద ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెరువులోని గుర్రపు చెక్కను తొలగించి, చెరువు కబ్జాకాకుండా కాపాడాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని తెలిపారు. ఆయన వెంట నాయకులు నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, అనిల్కిశోర్ తదితరులు పాల్గొన్నారు.