నేరేడ్మెట్, జనవరి 17: మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతంనగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణంలో స్థానిక ప్రజల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. గజానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి భూమి సేకరిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం గౌతంనగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు , విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆర్యూబీ నిర్మాణానికి సేకరించాల్సిన స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌతంనగర్ ఆర్యూబీ నిర్మాణంలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా ఎమ్మెల్యేకు వివరించారు. ఆర్యూబీతో తమ ఇండ్లను కోల్పోవాల్సి వస్తుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆర్యూబీ నిర్మాణానికి స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు కష్టపడి నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు తాము రాలేదని, ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి తాము ఆర్యూబీ నిర్మాణానికి పూనుకున్నామని స్పష్టం చేశారు.
ఈ నిర్మాణం కోసం రైల్వే, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ తదితర శాఖలకు సంబంధించిన అధికారులతో ఎన్నో సమీక్షా సమావేశాలు నిర్వహించి, ఇప్పటికీ ఒక కొలిక్కి తీసుకురాగలిగామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఇంజినీరింగ్, వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.