సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) :హైదరాబాద్ నగరంలో 35ఏండ్ల కిందట అప్పటి శివారు ప్రాంతాలుగా భావించి ఏర్పాటు చేసిన బస్ టెర్మినల్స్ నేడు నగరం మధ్యలోకి వచ్చేశాయి. వీటితో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడంతో ఈ టెర్మినల్స్ పాయింట్స్‌ను విస్తరించిన నగరానికి ప్రస్తుతం శివారులుగా ఉన్న ప్రాంతాలకు తరలించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ యాజమాన్యానికి లేఖలు రాశారు. దీంతో ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం ఉండే టెర్మినల్స్ మీదుగా కొత్తగా ఏర్పడే టెర్మినల్స్ వరకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి వస్తాయి. 25 టెర్మినల్స్ పాయింట్స్‌ను ఇతర ప్రాంతాలకు మార్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో వాహనాల ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలనే విషయాలపై క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. ఇందులో పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ట్రాఫిక్ వాస్తవ పరిస్థితి, ప్రత్యామ్నాయాలకు సంబంధించిన అంశాలను ఆరా తీస్తున్నారు.
అన్ని వైపులా నగర విస్తరణ
సిటీ బస్సులు పాయింట్ల వద్దకు బస్సులు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెళ్తుంటాయి. ఆ సమయంలో బస్సు డ్రైవర్లు, కండక్టర్ల షిఫ్టు సమయం ముగిస్తే, అక్కడే బస్సును పార్కు చేసి, మరో షిఫ్ట్‌లోకి వచ్చే వారికి అప్పగిస్తారు. చాలా వరకు మధ్యాహ్నం వేళల్లో బస్సులు ఆయా టెర్మినల్ పాయింట్స్ వద్దనే ఆగుతుంటాయి. అయితే అప్పట్లో శివారు ప్రాంతం కావడంతో సిబ్బంది, ప్రయాణికుల సౌకర్యార్ధం అక్కడ ఓ టెర్మినల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది, నగరం నడిబొడ్డులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. మెహిదీపట్నం, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న బస్ టెర్మినల్స్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని శివారు ప్రాంతానికి మార్చనున్నారు.
20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో..!
ప్రస్తుతం ఉన్న బస్ టెర్మినల్స్‌ను 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల ఏర్పాటు చేయాలా..? లోపల ఏర్పాటు చేయాలా.? అనే విషయాలను ఆలోచిస్తున్నారు. కొత్త టెర్మినల్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది. రవాణా వ్యవస్థ బాగున్నప్పుడు ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ముందు చూపుతో ఆర్టీసీ టెర్మినల్ పాయింట్స్‌ను ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో 30 ఏండ్లను దృష్టిలో ఉంచుకొని కొత్త టెర్మినల్ పాయింట్లను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం నగరానికి ఉన్న ఆర్టీసీ బస్ కనెక్టివిటీ ఈ చర్యలతో మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.