TSRTC | ఒకప్పుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాట పడుతున్నది. అధికారులు వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ జనాలకు మరింత దగ్గరవుతున్నారు. ప్రైవేటు వాహనాలకు దీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. జనాలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేలా సరికొత్త ప్లాన్లతో ముందుకొస్తున్నారు. తాజాగా ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మెట్రో ప్రత్యామ్నాయ మార్గాలలో, నగరం నలువైపులా అధికంగా ఆదాయం వచ్చే కొత్తరూట్లను వెతుకుతున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు పలు రూట్లలో బస్సులను నడుపుతున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : నగరంలో సిటీ బస్సులను కొత్త మార్గాలలో నడిపించేందుకు అర్టీసీ గ్రేటర్ అధికారులు రూట్ సర్వే చేస్తున్నారు. నగరంలో ప్రధాన, రద్దీ మార్గాలైన ఉప్పల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంబీజీబీఎస్ మార్గాలలో మెట్రో రైళ్లలో నగర వాసులు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే వాటికి ప్రత్యామ్నాయ మార్గాలలో ఆర్టీసీ బస్సులను నడుపాలని నిర్ణయించుకున్నారు. రోజురోజుకూ మహానగరం విస్తరిస్తుండగా టౌన్ షిప్‌లు వస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డుకు రెండు వైపులా శాటిలైట్ టౌన్‌షిప్‌లు కూడా ఏర్పాటవుతున్నాయి. నగర శివార్లలో అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు, పలు రకాల ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు పలు జాతీయ సంస్థలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నగరం నలువైపుల సిటీ బస్సులను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
గాజులరామారం నుంచి వేవ్‌రాక్ వరకు వయా బయోడైవర్సిటీ మీదుగా బస్సులను నడుపనున్నారు. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం, ఉప్పల్ నుంచి కొండాపూర్ వయా తార్నాక, ఆర్టీసీ క్రాస్ రోడ్‌తో పాటు వయా అంబర్పేట్ వయా ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా, ఎల్బీ నగర్ నుంచి కాచిగూడ వయా తార్నాక మీదుగా, బడంగ్పేట్ నుంచి ఈసీఐఎల్ వరకు వయా నాగోల్, ఉప్పల్, తార్నాక, లాలాపేట్ మీదుగా సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. కూకట్పల్లి, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌తో పాటు విప్రో జంక్షన్ వరకు, సికింద్రాబాద్-మణికొండ, సికింద్రాబాద్ నుంచి వేవ్‌రాక్ వరకు మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక సిటీ సర్వీసును కూడా అందుబాటులోకి తెచ్చారు. కోఠి నుంచి కొండాపూర్‌కు, సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లి వరకు మహిళా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ గ్రేటర్ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సుల ద్వారా అధిక ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు కృషి చేస్తున్నారు. అందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా నగరంలో అన్ని వైపులా కొత్త మార్గాలలో బస్సులను నడిపించడం వల్ల ఆదాయాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.