ఖైరతాబాద్, జూన్ 6 : ఆర్టీసీలో వివిధ కారణాలతో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తొలగింపునకు గురైన కార్మికుడు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో దుగ్గు రాజేందర్ మాట్లాడుతూ ఆర్టీసీలో కండక్టర్, డ్రైవర్, మెకానిక్, కానిస్టేబుల్, సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నామని, వివిధ కారణాలతో తొలగించారని, దీంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. గత ఏడాది ముఖ్మంత్రి, రవాణాశాఖ మంత్రి, ప్రజావాణిలో వినతి పత్రాలు సమర్పించామన్నారు.
దీంతో గత డిసెంబర్లో త్రీమెన్ కమిటీ వేశారని, కానీ ఇంత వరకు ఆ కమిటీ సిఫారసుల మేరకు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ట్రాన్స్‌పోర్టు, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఆర్టీసీ సీఎండీని ఆదేశిస్తూ జీవో జారీ చేశారన్నారు. గత నెల 28 తేదీల్లోగా తమను ఉద్యోగాల్లో తీసుకోవాలని కానీ, ఇప్పటి వరకు ఒక్కరిని కూడా తీసుకోలేదన్నారు. ఇప్పటికే 16 మంది కార్మికులు ఉద్యోగం రాదనే బాధతో చనిపోయారని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సుంకరి భాగేశ్వర్, కుమ్మరి గంగాధర్, దుగ్గి నగేశ్, ప్రసాద్‌రావు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.