RTC Employees | చిక్కడపల్లి, జూన్27: తమ ఉద్యోగాలు తిరిగి తమకివ్వాలని టీజీఎస్లో నుంచి తొలగించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగులు సంస్థ ఎండీని కలవడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ కు శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పటికే మొహరించిన పోలీసులు. ఉద్యోగులను అడ్డుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 938 కాపీని ఎండీకి అందజేయడానికి వెళ్తున్నామని పోలీసులకు చెప్పడంతో వారు కేవలం అయిదుగురిని మాత్రమే అనుమతించారు. ఎండీ లేకపోవడంతో జీవో కాపీని ఎండీ పీఏకు అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు రాజేందర్, ప్రసాద్ రావు, భాగేశ్వర్, గంగాధర్, రమేశ్ యాదవ్మాట్లాడారు. చిన్న చిన్న కారణాలవల్ల తమను ఉద్యోగం నుంచి తొలగించారని , ఉద్యోగాలు లేకపోవడంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జీవో జారీ అయ్యిందని వారు తెలిపారు. 60 రోజుల్లో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అందులో స్పష్టంగా ఉందన్నారు.కానీ యాజమాన్యం మాత్రం తమని విధుల్లోకి తీసుకోలేదని అన్నారు. గతంలో ఎండీ సజ్జనార్‌ను కలవడానికి మూడుసార్లు వచ్చిన ఆయన కలవలేదని తెలిపారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎండీకి స్వయంగా చెప్పిన తమని విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రావడానికి తమ కృషి ఎంతగానో ఉందన్నారు. కానీ ఈ సర్కార్ తమకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 1100 మంది రిమూవల్ ఆయన ఉద్యోగులు ఉన్నారని.. రోడ్డు పాలు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాల కోసం ప్రజాభవన్, బస్సు భవన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఎండీ సజ్జనార్ తమపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చెబుతున్న ఈ ప్రజాపాలనలో తమకు న్యాయం జరగడం లేదు. తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కూలి పనే జీవన ఆధారంగా మారింది. సంస్థలో 14 సంవత్సరాలు పనిచేశాను. తొలగించి మూడు సంవత్సరాలు అవుతుంది. పై అధికారి కక్షగట్టి తనను రిమూవ్ చేశాడు.
-చెన్నకేశవ, కండక్టర్ మహేశ్వరం డిపో
ఉద్యోగం నుంచి తొలగించడంతో వ్యవసాయ కూలిగా పని చేసుకుని బతుకుతున్న. తమ సమస్యలు చెప్పడానికి ఇక్కడికి వస్తే ఇది బస్ భవనా.. పోలీస్ స్టేషనా అర్థం కావడం లేదు. ఇది పోలీస్ పాలనను తలపిస్తుంది. మా సమస్యలు రేవంత్ రెడ్డికి తెలియడం లేదు.
-మౌనిక, హనుమకొండ
డ్రైవర్‌గా పనిచేసిన మా వారి ఉద్యోగం పోవడంతో ఉప్పరి పని చేసుకుంటున్నాం. బస్సు భవన్ చుట్టూ అనేకసార్లు తిరిగిన ప్రయోజనం లేదు. మా ఆయన ఒక్కరోజు ఆబ్సెంట్ కాకుండా డ్యూటీ చేశాడు. చెయ్యని తప్పుకు మా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. నాలుగేళ్లుగా ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాం.
-శోభ వరంగల్ డిపో 1 డ్రైవర్ సంజీవ్ సతీమణి