Private Travels | సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లడానికి బస్సులో సీటు కావాలన్నా.. క్యాబ్స్ల్లో ఎక్కించుకోవాలన్నా.. టికెట్ ధరల పోటీల్లో పాల్గొనాల్సిందే. ఔను రెండు, మూడింతలు టికెట్ ధరలు పెంచి ప్రయాణికుల నడ్డీ విరుస్తున్నారు. ఓవైపు ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ టికెట్ ధరలను పెంచితే.. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ ఇబ్బడి ముబ్బడిగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేద్దామనుకునే వారికి నిరీక్షణ తప్పకపోవడంతో వాళ్లంతా ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎటు చూసినా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.
300 రూపాయల టికెట్ రూ.500 వరకు బస్సుల్లో పెరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు ఇదే ప్రయాణం క్యాబ్‌లో 12-15వందల వరకు ఉందని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టికెట్ ధర రూ.1500 మించదు. కానీ ట్రావెల్స్‌లో రూ. 3వేల నుంచి 4,500 వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఊరెళ్లాలనే సందర్భం కావడంతో వాళ్లడిగినంత ఇస్తూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ 40 నిమిషాల నుంచి గంటన్నర వరకు ఒక బస్సు అందుబాటులోకి వస్తున్నది. దీంతో అంత సమయం నిరీక్షించలేక ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది.
ఇంకోవైపు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో రద్దీని తలపిస్తున్నాయి. మొత్తంగా సంక్రాంతి పండుగ దృష్ట్యా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, శివారు బస్ బేలు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ఎయిర్పోర్ట్ కూడా ప్రయాణికుల రద్దీని తలపిస్తున్నది. బస్సులు, రైళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది విమానాలను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం, రాజమండ్రి, వైజాగ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో పలు ఫ్లైట్ల టికెట్ ధరలను కూడా పెంచేశారు. రాజమండ్రి వెళ్లాలంటే సుమారు 15వేల వరకు ఖర్చు అవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు.
ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల ఓపికను పరీక్షిస్తున్నాయి. సంక్రాంతి దృష్ట్యా 6వేలకు పైగా బస్సులు అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు.. కానీ బస్సులు మాత్రం సమయానికి రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ స్టేషన్లతో పాటు నగర శివారు బస్ బేలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు నిల్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్డినరీ బస్సులు సైతం ఉచిత బస్సు స్కీంతో మహిళలతో కిక్కిరిపోతున్నాయి. బస్టాండ్ల్లోనే బస్సులు ఫుల్ కావడంతో ఆ బస్సులు నగర శివార్లకు వెళ్లేసరికి అక్కడి ప్రయాణికులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నడస్తున్న పలు ట్రావెల్స్‌పై రవాణా శాఖాధికారులు కేసులు నమోదు చేశారు. అధిక ధరలు వసూలు చేసినా.. ట్రావెల్స్‌లో పరిమితికి మించి అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్నా కేసులు నమోదు చేస్తామని అధికారులు చెప్పారు. ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
వేలాది కార్లు రోడ్డెక్కాయి. ఇక నగరమంతా సొంతూరుకు కదలడంతో హైవేలన్నీ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్, కూకట్పల్లి, దిల్షుక్నగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. విజయవాడ-హైదరాబాద్ హైవే వాహనాల రద్దీతో కిటకిటలాడింది. చౌటుప్పల్ చౌరస్తాలో అండర్ పాస్ పనులతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గంటకు 30-40 కిలో మీటర్ల వేగం కూడా కార్లు వెళ్లలేకపోతున్నాయి. టోల్ గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. నగరవాసికి ఇల్లు చేరుకోవడానికి తీవ్ర నరకం చూడాల్సి వచ్చిందని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రయాణ కష్టాలను పంచుకోవడం విశేషం.