మాదాపూర్, సెప్టెంబర్ 14: రోడ్డు దాటుతున్న యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ కథనం ప్రకారం … బర్కత్పుర తానాకు చెందిన వినోద్ కుమార్తె కలువ మాధవి (25) ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది.
ఈ నెల 13న ఆమె తన విధులు ముగించుకొని కొత్తగూడ చౌరస్తా నుంచి సైబర్ టవర్ వైపు రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు (టీఎస్ 10 యుబి 8168) డ్రైవర్ అతివేగంగా నడిపి వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా సమీపంలో ఉన్న కిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. కాగా ఈ నెల 14న సాయంత్రం చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది.