వాహన కొనుగోలులో షోరూంలు ఇచ్చిన డిస్కౌంట్‌కు కూడా పన్ను చెల్లించాల్సిందే… పూర్తి ట్యాక్స్ కడితేనే.. ఆ వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. లేదంటే.. బ్రేక్ పడుతుంది. అదేంటీ మాకు షోరూం వాళ్లు డిస్కౌంట్ ఇచ్చారు కదా.. దాని మేరకే పన్ను చెల్లిస్తామంటే కుదరదంటున్నారు ఆర్టీఏ అధికారులు. షోరూం ధరపై పన్ను చెల్లించాల్సిందేనని, డిస్కౌంట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.
Showroom Discount | సిటీబ్యూరో, ఆగస్టు 12 ( నమస్తే తెలంగాణ): ఇటీవల మహేశ్ అనే వ్యక్తి రూ. 3.34 కోట్ల విలువ జేసే మెర్సిడెస్- బెంజ్ కంపెనీకి చెందిన ఓ కారును కొనుగోలు చేశాడు. ఆ కంపెనీ సదరు వ్యక్తికి రూ.30 లక్షలు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో అతడు రూ.3 కోట్ల నాలుగు లక్షలకు కారును కొనుగోలు చేశాడు. రూ. 30 లక్షలు డిస్కౌంట్ వచ్చిందని సంబురపడిన ఆ వ్యక్తి వెంటనే కారు కొనుగోలు చేసి.. ఆ మేరకు మాత్రమే పన్ను చెల్లించాడు. తీరా అతడు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళితే..మరో 30 లక్షలపై పన్ను చెల్లించాలని అధికారులు చెప్పారు. దీంతో అవాక్కవ్వడం కస్టమర్ వంతైంది.
‘అదేంటీ? నేను కంపెనీ ఇచ్చిన ఇన్వాయిస్లో ఉన్న మొత్తానికి ట్యాక్స్ చెల్లించాను. కంపెనీ నాకు డిస్కౌంట్ ఇచ్చింది. ఆ డిస్కౌంట్‌కు నేనెలా పన్ను చెల్లిస్తాను?’ అంటూ సదరు వ్యక్తి ఆర్టీఏ అధికారులకు మొరపెట్టుకున్నాడు. కానీ రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఏదైన వాహనం షోరూం ధర ఎంత ఉన్నా.. ఆ మేరకు పూర్తి పన్ను చెల్లించాల్సిందే. ఆ ధరలో డిస్కౌంట్ అనేది కేవలం కంపెనీ కస్టమర్‌కు ప్రకటించడమే. అంతేతప్ప.. పన్ను మినహాయింపునకు వర్తించదు’.
అని అధికారులు స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక వాహనం ధర రూ.20 లక్షలు ఉంటే కంపెనీ డిస్కౌంట్ పేరుతో కస్టమర్‌కు 10 లక్షలకు ఇచ్చినా.. ఇన్వాయిస్ బిల్లు రూ. 10 లక్షలతో తీసుకొచ్చినా.. ఆ వాహన ధర ఆర్టీఏ డేటాబేస్‌లో ఉంటుంది. ఆ 20 లక్షలపైన 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిస్కౌంట్ అనేది పన్ను మినహాయింపునకు కాదనేది.. కస్టమర్లు అవగాహన చేసుకోవాలని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
వాహనం ఏ ధరకు కొనుగోలు చేసినా…
రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం ఏ ధరకు కొనుగోలు చేసినా..పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిస్కౌంట్ ఎంత ఇచ్చినా.. పన్ను విషయంలో మినహాయింపు కుదరదు. వాహనదారులు దీనిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. కొందరికీ ఈ విషయం తెలియక రిజిస్ట్రేషన్ సమయంలో అయోమయానికి గురవుతుంటారు. వారికి మేము నిబంధనలు తెలియజేసి పన్ను చెల్లించాలని కోరుతున్నాం.
-రవీందర్ కుమార్, ఆర్టీఓ, నాగోల్