సిటీబ్యూరో: ఇప్పటికే వాహనదారులపై ఆర్టీఏ లైఫ్ ట్యాక్స్ పెంపు, సర్వీస్ చార్జీ భారం ఇప్పటికే తడిసి మోపడైంది. ఇది చాలదన్నట్టు ఇటీవల రోడ్డు సెస్ భారం కూడా సర్కార్ వేసింది. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేయడం దేవుడెరుగు.. మార్కెట్లో పాత వాహనం కొనే పరిస్థితి కూడా లేదని సామాన్యులు వాపోతున్నారు.
రోడ్డు ట్యాక్స్, సర్వీస్ చార్జీలతో పాటు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన రోడ్డు సెస్‌తో సామాన్యుల వాహన కొనుగోలు కల ఆవిరిపోతున్నది. సెకెండ్ హ్యాండ్ వెహికల్ మార్కెట్స్ల్లో ఓ బైక్ దర రూ.25వేలు పలకగా, రోడ్డు సెస్ ప్రభావంతో ఆ బండి ధర 26,500గా చెబుతున్నారు. మార్కెట్లో అదే బైక్ కొత్తది రోడ్డు సెస్‌తో అధిక ధర ఉండటంతో పాత బైక్ కూడా ధర పెంచినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఒక పాత వాహనాన్ని సగం డబ్బులకో..మరింత తక్కువ ధరకో కొనుగోలు చేస్తుంటారు. రూ.10 లక్షల కారును రూ.4 లక్షలకు ఒక వ్యక్తి కొనుగోలు చేస్తే.. ఆ వ్యక్తికి సర్వీస్ చార్జీ మాత్రం రూ.10 లక్షల (ఇన్వాయిస్ ధర) మీద పడుతుంది. మొత్తం ధరపై 0.1 శాతం రుసుం చెల్లించాలి.