సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): కస్టమ్స్ నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని నమ్మించి వ్యాపారులకు కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెడుతున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.51 లక్షల నగదు, రూ. 6.86 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వివరాలను మంగళవారం నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. నెల్లూర్ జిల్లా కావలికి చెంది కర్రెద్దుల విజయ్‌కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తున్నామంటూ తమ ఊరిలో జరిగిన ఒక మోసం గూర్చి తెలుసుకొని తాను కూడా అలాగే మోసాలు చేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు తన స్వస్థలానికి చెందిన వృత్తిరీత్యా డ్రైవైర్లెన బోగిరి సునీల్ గవాస్కర్ అలియాస్ హరీశ్, అడిగోపుల ఓమ్ సాయి కిరీటి, తెనాలికి చెందిన వ్యాపారి నంబూరి డేవిడ్ లివింగ్‌స్టోన్ అలియాస్ సెంథిల్‌తో ఒక ముఠాను ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడైన విజయ్‌కుమార్‌పై కావలిలో 13 చీటింగ్ కేసులు, సెంథిల్‌పై రెండు కేసులు నమోదయ్యాయి, వీళ్లకు స్థానిక పోలీసులు ఘాటైన వార్నింగ్ ఇవ్వడంతో తమ మకాంను బెంగళూర్‌కు మార్చారు.
విజయ్‌కుమార్, డేవిడ్ లైవింగ్ స్టోన్ వ్యాపారుల వద్దకు వెళ్లి తక్కువ ధరకు బంగారం ఉందని సంప్రదిస్తారు. తమ వద్ద ఉండే అసలైన 5 తులాల బంగారాన్ని రూ. 2 లక్షలకే విక్రయించి వ్యాపారుల నమ్మకాన్ని పొందుతారు. మేం కస్టమ్స్ నుంచి తక్కువ ధరకు బంగారాన్ని కొంటాం, మీకు కావాలంటే వారం రోజుల్లో కిలో, రెండు కిలోలు అందివ్వగలమంటూ నమ్మిస్తారు. వీళ్ల మాటలు నమ్మిన వ్యాపారులు అందుకు కొంత అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తారు. బంగారాన్ని మాత్రం బెంగళూర్, చెన్నైలో అందిస్తామంటూ నమ్మిస్తారు. అడ్వాన్స్ తీసుకున్న వాళ్లు బెంగళూర్‌కు వెళ్లిన సమయంలో మీ బంగారం రావడానికి ఇంకా వారం పడుతుందని, తక్కువ ధరకు మాట్లాడుకున్నట్లుగా పూర్తి మొత్తాన్ని ఇవ్వాలని చెబుతారు. ఆ సమయంలోనే బోగిరి సునీల్ గవాస్కర్ అక్కడ హడావిడి చేస్తుంటాడు. మీకు మొత్తం డబ్బు ఇస్తున్నామంటూ నకిలీ నోట్ల కట్టలను అందజేసి కస్టమర్లా నటిస్తుంటాడు. అక్కడ భారీ ఎత్తున బంగారం వ్యాపారం నడుస్తుందనే బిల్డప్ ఇస్తారు. చెప్పినట్లు కొన్ని రోజుల తరువాత అక్కడకు వెళ్లి బంగారం తీసుకుంటాడు. అయితే అతనికి అసలైన బంగారం ప్యాక్ చేసే కవర్లలోనే నకిలీ బంగారం ప్యాక్ చేసి, మొత్తం డబ్బులు తీసుకొని పంపిస్తారు. కొద్ది దూరం వెళ్లగానే పోలీసు దుస్తుల్లో ఓమ్‌సాయి కిరిటీ వచ్చి వారిని ఆపి వాహనాన్ని తనిఖీ చేస్తారు, అక్రమ దందా చేస్తున్నారని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తీసికెళ్లండంటూ ఆ నకిలీ బంగారాన్ని తీసుకొని అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇలా వ్యాపారులను మోసం చేస్తున్నారు.
బోడుప్పల్‌కు చెందిన శ్రీ దిలీప్ బార్ఫ వృత్తిరీత్యా వ్యాపారి. తన స్నేహితుడు సింగిరెడ్డి సురేశ్‌కు వచ్చిన సమాచారంతో మే 19న బెంగళూర్, టీసీ పాల్యకు వెళ్లి అక్కడ విజయ్‌కుమార్, సునీల్ గవాస్కర్‌ను కలిశారు. రూ. 6 లక్షలు తీసుకొని 101 గ్రాముల బంగారం ఇచ్చారు. దీంతో దిలీప్‌కు నమ్మకం కుదిరి 2 కిలోల బంగారం కోసం మొదట రూ. 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. వారం రోజుల తరువాత బెంగళూర్‌కు వెళ్లి విజయ్‌కుమార్‌ను కలిశారు. ఆ సమయంలో 5 కిలోల బంగారం విక్రయిస్తున్నట్లు, కొన్నవాళ్లు డబ్బులు ఇస్తున్నట్లు అంతా నకిలీ బంగారం, నకిలీ నోట్లతో నాటకం చేశారు. ఈ నాటకం చూసి బాధితుడు నిజమని నమ్మాడు. దీంతో మిగతా రూ. 90 లక్షలు కూడా చెల్లించారు. మీ స్టాక్ ఇంకా రాలేదు, మా మేనేజర్‌ను కలుద్దామంటూ చెన్నైకి తీసుకెళ్లి రాయల్ మెరిడియన్ హోటల్లో గదిని తీసుకున్నారు. సెంథిల్‌ను కల్పించారు, అయితే మీ బంగారం బంజారాహిల్స్‌లోని రోడ్డు నం.35లో మీరు కలెక్ట్ చేసుకోండి అంటూ అతడు సూచించాడు. ఆ తరువాత అక్కడి నుంచి బాధితుడు రాగానే ఈ ముఠా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. ఆ తరువాత సెల్‌ఫోన్ ఆన్‌లో ఉన్నా ఫోన్లు లిఫ్టు చేయకపోవడంతో అనుమానం వచ్చి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాను పట్టుకొని విచారించి వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 51 లక్షల అసలు నగదు, ఒక పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్, మూడు ఖరీదైన కార్లు, రూ. 6.86 కోట్ల నకిలీ నోట్ల కట్టలు, 5 కిలోల నకిలీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.