సిటీబ్యూరో: సైబర్‌నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి టోకరా వేశారు. మేడపల్లికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్‌కు సైబర్ నేరస్తులు ఎల్కేపీ వీఐపీ వన్ టూ వన్ సర్వీస్ గ్రూప్, ఎల్కేపీ-77 అడ్వయిజరీ గ్రూప్‌ల పేర్లతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లకు యాడ్ చేశారు. బాధితుడు ఎల్కేపీఎన్ హెచ్‌డబ్ల్యూఎల్ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం ఆ యాప్ అడ్మిన్‌గా చెప్పుకొంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ‘మేమందరం స్టాక్ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నా’మని.. మీరు కూడా ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చంటూ సూచనలు చేశారు.
బాధితుడు ఆ యాప్‌లో తన ఖాతాను తెరిచి మొదట రూ. 11 వేలు వెచ్చించి.. స్టాక్స్ కొనుగోలు చేశాడు. దఫ దఫాలుగా రూ. 14.95 లక్షలు అందులో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. కేవలం 11600 మాత్రమే విత్ డ్రా చేయగలిగాడు. మిగతా సొమ్ము రూ. 14.84 లక్షలను సైబర్‌నేరగాళ్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.