సిటీబ్యూరో/సైదాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): పాత కక్షలు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న ఓ రౌడీషీటర్‌ను హత్య చేయాలని రూ.13 లక్షలు సుపారీగా ఇచ్చి.. హత్యకు కుట్ర చేశారు. తమ పేరు, కుట్ర కోణం బయటకు రాకుండా.. హోమో సెక్స్ కారణంగా హత్య జరిగినట్లు నాటకం ఆడారు. హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది. హత్య వెనుక ఉన్న ఒక మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిని సౌత్-ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సౌత్-ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రూపేశ్, అదనపు డీసీపీ మనోహర్, చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్‌కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈనెల 11వ తేదీ తెల్లవారుజామున చాంద్రాయణగుట్ట, బార్కాస్‌కు చెందిన సయ్యద్ బిన్ అబ్దుల్ రహమాన్ బవజార్ అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మృతుడు బవజీర్పై చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. 9 కేసుల్లో నిందితుడు. అతడిపై 3 పోక్సో కేసులు కూడా ఉన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ వర్కర్‌గా మారాడు. జల్పల్లి మున్సిపల్ చైర్మన్, అతడి కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలపై ఆయా విభాగాలకు ఫిర్యాదులు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నాడు. దీంతో అతడిని హత్య చేయాలని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, అతడి తండ్రి అహ్మద్ సాది (రౌడీషీటర్), మరో సోదరుడు సాలే సాధి కలిసి హత్యకు కుట్ర చేశారు. అయితే, ఈ కుట్ర బయటకు రాకుండా ఉండేందుకు మృతుడు హోమో సెక్స్‌కు అలవాటు అయ్యాడనే విషయాన్ని ప్రచారం చేశారు. హోమో సెక్స్ విషయంలోనే గొడవ జరిగి హత్య జరిగినట్లు సీన్ క్రియేట్ చేసేందుకు పాత నేరస్తుడికి సుపారీ ఇచ్చి, పథకాన్ని రూపొందించి అమలు చేశారు.
గతంలో హోమో సెక్స్‌కు నిరాకరించిన అయూబ్‌ఖాన్ వచ్చాడంటూ.. నిందితుడు మృతుడికి వల వేశాడు. పలుమార్లు ఫోన్ చేయడంతో అతడిని తీసుకొని బండ్లగూడలోని తన కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో అహ్మద్ బిన్, అయూబ్ కలిసి ఒక వాహనంపై, మరో వాహనంపై మున్సిపల్ చైర్మన్ బంధువు ఒమర్ సాధీ ఘటనా స్థలికి వెళ్లారు. ఒమర్ సాధీ బయట ఉండగా, ఇద్దరు కార్యాలయంలోకి వెళ్లారు. గదిలోకి వెళ్లిన తరువాత హోమో సెక్స్‌కు ఒప్పుకున్నట్లు నటించి.. అతడి కంట్లో కారం పౌడర్ చల్లారు. తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ప్రధాన నిందితుడైన అహ్మద్ బిన్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో అహ్మద్ బిన్ హజీబ్, అహ్మద్ సాదీ, అబ్దుల్లా సాదీ, మహమ్మద్ అయ్యూబ్ ఖాన్‌ను అరెస్ట్ చేయగా, సలేహ్ సాదీ, ఒమర్ సాదీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు షేక్ బవజీర్ చంచల్‌గూడ జైల్లో ఉన్న సమయంలో.. భవానీనగర్‌కు చెందిన రౌడీషీటర్ అహ్మద్ బిన్ హజీబ్ పరిచయమయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వీరిద్దరు స్నేహితులుగా మారి, హోమో సెక్స్ (అసహజ సెక్స్)కు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే మృతుడు మొఘల్‌పురాకు చెందిన మహ్మద్ అయూబ్‌ఖాన్‌తో కూడా హోమో సెక్స్ చేయాలని ప్రయత్నించగా, అయూబ్‌ఖాన్ తిరస్కరించాడు. ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు తెలుసుకొని.. అహ్మద్ బిన్ హజీబ్‌ను సంప్రదించారు. షేక్ బవజీర్‌ను హత్య చేస్తే రూ.13 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే, తమపై ఎవరికీ అనుమానం రావద్దని, మీకున్న హోమో సెక్స్ కాంటాక్టులతోనే హత్య జరిగినట్లు సీన్ క్రియేట్ చేసి, అదే విషయం బయటకు రావాలని ఒప్పందం చేసుకున్నారు.
హైదరాబాద్ పోలీసులు ప్రతి కేసును లోతుగా దర్యాప్తు చేస్తారని, అందుకు నిదర్శనం ఈ కేసు దర్యాప్తు అని డీసీపీ రూపేశ్ తెలిపారు. సోషల్‌మీడియాలో ఈ కేసు విషయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడారని, తాము లోతైన దర్యాప్తు చేసి కుట్ర కోణాన్ని బయటకు తీశామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి కేసులో ఇలాగే జరుగుతుందన్నారు. నేరం చేసిన నిందితులు ఎంతటి వారైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని డీసీపీ తెలిపారు.