సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రౌడీషీటర్ల గ్యాంగ్‌ల మధ్య దాడులు ప్రతీకార దాడులతో హైదరాబాద్ అట్టుడుకున్నది. రౌడీషీటర్లపై మధ్య అంతర్గత కుమ్ములాటలు గ్యాంగ్‌వార్‌లకు దారి తీస్తున్నాయి. వీరిపై నిరంతరం ఉంచాల్సిన నిఘా నిద్రావస్థలోకి పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరుగుతున్న పలు హత్యలు రౌడీషీటర్లకు సంబంధించినవే ఉంటున్నాయి. తాజాగా పహాడీషరీఫ్‌లో జరిగిన రౌడీషీటర్ హత్య సైతం గత ఏడాది జరిగిన .హత్య మరో హత్యకు ప్రతీకారంగా జరిగిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.
ఇది రౌడీషీటర్ల గ్యాంగ్‌ల మధ్య గొడవతో జరిగిన హత్యలు, ఆ తరువాత అవే ముఠాలలోని సభ్యుల ప్రతీకారంతో జరుగుతున్న హత్యలని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల జవహర్‌నగర్ ఠాణా పరిధిలో పట్టపగలు నడిరోడ్డుపై కత్తులు, తుపాకులతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో పాతికేళ్ల పగ, ప్రతీకారాలతో జరిగినవిగానే పోలీసుల విచారణలో బయటపడింది. ఇలా ఒక్కో హత్య వెనుక పగ ప్రతీకారంతో పాటు ఆస్తుల తగాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. కరుడుగట్టిన రౌడీషీటర్లను అణిచివేయాల్సిన పోలీసు నిఘా నిద్రావస్తకు పోయిందా అనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా పహాడీషరీఫలో జరిగిన హత్య కేసులో 2024 జనవరిలో జరిగిన ముబారక్ సియార్ హత్య కేసుతో సంబంధం ఉండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
కొందరు రౌడీషీటర్లు రాజకీయ నాయకులతో పాటు కిందిస్థాయి పోలీసులతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రౌడీషీటర్లలో మార్పు తెచ్చేందుకు కొందరు పోలీసు అధికారులు అప్పడప్పుడు ప్రయత్నిస్తున్నా.. అవి పూర్తి ఫలితాలు ఇచ్చే వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయనే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెటిల్మెంట్లు, పగలు, ప్రతీకారాలు తీర్చుకునే వ్యవస్థలో కూరుకుపోయిన రౌడీషీటర్లు మరింత కరుగుట్టిన నేరాలతో నగరంలో రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు, నిరంతర నిఘాను పెంచాల్సిన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.