సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రౌడీషీటర్లు కొత్త దారి ఎంచుకుంటున్నారు. ఇప్పటిదాకా సాగిన స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు మందగించడంతో స్మగ్లర్లుగా మారారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి నగరంలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో పట్టుబడుతున్న గంజాయి స్మగ్లర్లలో నగరానికి చెందిన పలువురు రౌడీషీటర్లు ఉండంతో ఈ విషయం రుజువైంది.
వివిధ కేసుల్లో జైళ్లకు వెళుతున్న రౌడీషీటర్లకు అక్కడ గంజాయి వ్యాపారులతో పరిచయాలు పెరుగుతున్నాయి. అప్పటికే జైల్లో ఉంటున్న గంజాయి విక్రేతలు, సరఫరాదారులు, గంజాయి పండించే వారితో పరిచయాలు పెంచుకుంటున్నారు. గంజాయిని ఎలా సరఫరా చేయాలో తెలుసుకుని బయటకు రాగానే తమ దందా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఏ దారిలో తనిఖీలు ఉండవో లేదా తక్కువగా ఉంటాయో అటువంటి మార్గాలను ఎంచుకొని రౌడీషీటర్లు గంజాయిని తరలిస్తున్నారు.
ఇప్పటివరకు ఎక్కువగా గంజాయి ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సరఫరా అవుతూ వస్తున్నది. అందువల్లే ఈ మార్గంలో రోడ్డు, రైళ్లల్లో తనిఖీలు విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. కానీ నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు మాత్రం పెద్దగా తనిఖీలు జరిగే అవకాశం లేకపోవడంతో రౌడీషీటర్లు ఆ మార్గంలో గంజాయిని నగరానికి చేరుస్తున్నారు. కిలో గంజాయి కోసం 4 వేల నుంచి 7 వేల వరకు వెచ్చిస్తున్నారు. నాగపూర్‌లో కొనుగోలు చేసిన గంజాయిని ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకమైన ప్యాకేజీ చేయించి.. కిలో 25వేల వరకు అమ్ముతున్నారు.
నగర పోలీసు విభాగం, టాస్క్‌ఫోర్స్, నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఎప్పటికప్పుడు మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేసే తనిఖీల్లో ఇటీవల పలువురు రౌడీషీటర్లు పట్టుబడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిన మారేడుపల్లి రౌడీషీటర్లు సంజయ్, వపన్, ఏప్రిల్ 11న టప్పాచబుత్రలో ఇమ్రాన్, ఏప్రిల్ 14న చాదర్ ఘాట్‌లో మహమ్మద్ ఇమ్రాన్, ఏప్రిల్ 24న మాసబ్ ట్యాంక్‌లో మహ్మద్ సోఫియానుద్దీన్, మే 20న స్నాచర్ సయ్యద్ సయీద్ హుస్సేన్‌లను పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా అరెస్టు చేశారు. కాగా, నగరంలో రియల్ఎస్టేట్ పూర్తిగా పడిపోవడంతో ఎక్కడా సెటిల్మెంట్లు లేక తమకు ఇబ్బందులు అవుతున్నాయని, అందుకే ఈ దందా చేస్తున్నామని పోలీసు విచారణలో రౌడీషీటర్లు చెప్పినట్లు తెలిసింది. గతంలో తాము సంపాదించిన దాని కంటే గంజాయి అమ్మడం ద్వారానే లాభాలు వస్తున్నాయని రౌడీషీటర్లు పోలీసులకు వివరించినట్టు సమాచారం