Rowdy Sheeters | సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఇలా హైదరాబాద్‌లో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. హత్యలు, బెదిరింపులు, ప్రైవేటు సెటిల్మెంట్లు భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల కట్టడికి పోలీసు యంత్రాంగం కఠిన వైఖరి అవలంబిస్తోంది. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఎస్హెచ్ఓలు, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ వర్గాలు రౌడీషీటర్లు, పాతనేరస్తుల కార్యకలాపాలు, సోషల్‌మీడియాలో వారు చేస్తున్న పోస్టులను గమనిస్తూ హద్దు మీరిన వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
నగర పరిధిలో 1517 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 20 శాతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు. 40 నుంచి 50 మంది వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందంటూ అక్రమంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు. లంగర్‌హౌజ్‌లో ఓ రౌడీషీటర్ ప్రాణ భయంతో రూ.2లక్షలు పెట్టి తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు మారణాయుధాలతో తిరుగుతుండగా, వారిపై కూడా కేసులు పెట్టారు.
గోషామహల్లో ఓ రౌడీషీటర్ తన గ్యాంగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిని స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లలో ఎక్కువగా సౌత్జోన్లో 399 మంది ఉండగా, నార్త్‌లో 185, సెంట్రల్లో 114, వెస్ట్‌లో 177, సౌత్ ఈస్ట్‌లో 233, సౌత్ వెస్ట్‌లో 293, ఈస్ట్‌లో 116 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన పోలీసులు.. ఏదైనా తేడా అనిపిస్తే కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇటీవల 12 గ్యాంగ్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.