శేరిలింగంపల్లి, మే 16 : మూత్రపిండ సమస్యతో బాధపడుతున్న 21 రోజుల శిశువును సిటిజన్ హాస్పిటల్ వైద్యులు రోబోటిక్ శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. మంగళవారం నలగండ్లలోని సిటిజన్ దవాఖానలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటిజన్ హాస్పిటల్ యురాలాజీ విభాగాధిపతి డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి వివరాలు వెల్లడించారు. 3.2 కిలోల బరువుతో పుట్టుకతోనే మూత్రపిండాల వాపు వ్యాధితో ఉన్న శిశువుకు కుడి పెల్విక్ యూరిటెరిక్ జంక్షన్ అడ్డుగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పుట్టుకతో వచ్చే మూత్రపిండాల సమస్యలకు, ఇతర మూత్ర విసర్జన సమస్యలకు ఆటంకాలను సరిచేసే అరుదైన రోబోటిక్ శస్త్రచికిత్స విధానం (పైలోప్లాస్టీ) చేయాలని వైద్యబృందం నిర్ణయించింది. సిటిజన్ యూరాలజీ వైద్యులు భానుతేజా రెడ్డి, మురళీధర్ జోషిల నేతృత్వంలో రోబోటిక్ ఫైలోప్లాస్టీలో భాగంగా రోబో పరికరాలతో శిశువు మూత్రవిసర్జనకు అడ్డంకిని తొలగిస్తూ బ్లాడర్, కిడ్నీని అనుసంధానం చేస్తూ… ఉన్న ట్యూబ్ను సరిచేస్తూ శస్త్ర చికిత్స నిర్వహించి దవాఖాన నుంచి ఇంటికి క్షేమంగా పంపించారు. 21 రోజుల శిశువుకు రోబోటిక్ శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడటం దేశంలోనే అరుదైన ఘటనగా ఈ సందర్భంగా డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సిటిజన్ హాస్పిటల్ ఆర్సీఓఓ డాక్టర్ ప్రభాకర్తో పాటు చిన్నారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.