బండ్లగూడ, డిసెంబర్ 29: అపార్టుమెంట్‌లోని రెండు ఫ్లాట్ల తాళాలు పగులగొట్టిన దుండగులు 15 తులాల బంగారు నగలు, రూ.3.80 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ప్లిసెంట్ పార్కు కాలనీలోని అముల్ అర్కేడ్ అపార్ట్మెంట్లో కరుణాకర్ రెడ్డి, కార్తీక్ కుటుంబాలు ఉన్నాయి. వీరిద్దరూ ఉద్యోగులు. మంగళవారం ఉదయం ఇండ్లకు తాళాలు వేసి ఉద్యోగాలకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి.. ఐదో అంతస్తులో ఉన్న కరుణాకర్‌రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టారు.
ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 4.5 తులాల బంగారం, రూ. 80 వేల నగదును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా.. మొదటి అంతస్తులో ఉన్న కార్తీక్ ఇంట్లో నుంచి కూడా 11 తులాల బంగారం, రూ.3లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం కరుణాకర్‌రెడ్డి ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఇంట్లో దాచిన నగలు, నగదు కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందించారు. అపార్ట్‌మెంట్‌కు వచ్చిన పోలీసులు మొదటి అంతస్తులో ఉంటున్న కార్తీక్ ఇంట్లో కూడా దొంగలు పడినట్లు గుర్తించి వివరాలు సేకరించారు. రెండు దొంగతనాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.