Hyderabad | హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.
నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రషీద్ ఉదయం 7 గంటలకు ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో రూ.6లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు ఒక బ్యాగ్‌తో వచ్చాడు. రషీద్ డబ్బులతో రావడం గమనించిన కొందరు దుండగులు, అతని చేతిలోని బ్యాగును లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అది గమనించిన రషీద్ ప్రతిఘటించడంతో అతనిపై కాల్పులు జరిపి డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది.
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రషీద్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించాయని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ఘటనపై తమకు కాల్ వచ్చిందని.. వెంటనే అలర్ట్ అయ్యామని పేర్కొన్నారు. నిందితుల కోసం ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నిందితులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
