Mylardevpally | మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 24 : అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బస్తీలు, కాలనీలలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. గోతులమయంగా రోడ్లు, పొంగిపోర్లుతున్న డ్రైనేజీలతో బస్తీలు పూర్తిగా దుర్గంధభరితంగా మారుతున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌లో సమస్యలు రోజు రోజుకు జఠిలమవుతున్నాయి. వీటిని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ప్రజలు అలాగే కాలం వెల్లదీస్తున్నారు.
అడుగుమేర పడిన గోతుల కారణంగా ఈ దారుల్లో నడిచేందుకు సైతం వీలు లేకుండాపోతుంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. అసలే చిన్న చిన్న రోడ్లు ఇవి కూడా సరిగ్గా లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరించకపోవడంతో డ్రైనేజీలు పూర్తిగా శిథిలాస్ధకు చేరుకోని రోడ్లపై పారుతున్నాయి. పైగా డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ సైతం సరిగ్గా లేకపోవడంతో సమస్య మరింత దారుణంగా మారుతున్నాయి. ఇళ్ల ముందు పారుతున్న డ్రైనేజీ నీటి కారణంగా ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అనేక అనారోగ్యాలకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు.