కుత్బుల్లాపూర్, డిసెంబర్ 5: కొంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జయభేరిలో గోగ్రీన్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అయితే దానికి ఓసీ(అక్యుపెన్సీ సర్టిఫికెట్) రావాలంటే బహుళ అంతస్తుల నిర్మాణానికి రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తవ్వాలి. అయితే సంస్థ నిర్వాహకులు రాత్రికి రాత్రే తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలంలో రోడ్డును నిర్మిస్తున్నారు.
కాలనీవాసులు అడ్డుకొని.. మున్సిపల్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయినా నిర్మాణ సంస్థ నిర్వాహకులు వీటన్నింటినీ పట్టించుకోకుండా రోడ్డుని నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, జయభేరి వారియర్స్ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, సంబంధిత ఇంజినీరింగ్ సెక్షన్ విభాగం డీఈ తిరుపతి నేరుగా పనులను నిలిపివేయించారు. ఏమైందో ఏమో కానీ నిర్మాణదారులు తిరిగి పనులు మొదలుపెట్టడం చర్చానీయంశంగా మారింది.
నిబంధనల ప్రకారం రోడ్డును కాలనీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలి. అయితే సదరు నిర్మాణ సంస్థ నిర్వాహకుడు తమ బహుళ అంతస్తుల నిర్మాణానికి మాత్రమే వర్తించేలా రహదారిని నిర్మిస్తున్నాడు. ఒకవేళ సొంతంగా రోడ్డు నిర్మించాలంటే.. మున్సిపల్ అధికారులు అధికారికంగా బహిరంగపర్చాలి. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదంటున్నారు.
దూలపల్లిలో షాపూర్‌నగర్ రోడ్డులో బహుళ అంతస్తులో ఓ నిర్మాణదారుడు కమర్షియల్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రధాన డ్రైనేజీ పైపులైన్‌కు రాత్రికి రాత్రే కలుపుకొన్నాడు. అపర్ణ ఫాంగ్రోస్లో ఎమ్యూనిటీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి నిర్మాణం చేపడుతున్నాడు. దూలపల్లిలో షాపూర్‌నగర్ రోడ్డులో అధికార పార్టీ నేత ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కమర్షియల్ నిర్మాణం చేపడుతున్నాడు.
కాగా, దూలపల్లి రెసిడెన్సీయల్ ఏరియాలో అక్రమంగా కమర్షియల్ షెడ్డు నిర్మాణం జరుగుతున్నదని ఆయా కాలనీవాసులు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు మౌనం వహించడంతో పాటు భారీగా చేతివాటం ప్రదర్శిస్తూ.. దగ్గరుండి నిర్మాణదారులను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.