Hyderabad | అడ్డగుట్ట, మే 27 : చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి క్లియర్ అయింది. పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట చేపట్టిన శాంతియుత దీక్షకు ప్రభుత్వం స్పందించింది. దీంతో సదరు ప్రహరీ గోడను తక్షణమే తొలగించి పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని హైడ్రా అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంగళవారం పాఠశాల దారికి అడ్డుగా ఉన్న గోడను తొలగించారు.
విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే శాంతియుత దీక్ష చేపట్టాను..
చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దారి లేకపోవడంతో గత కొంతకాలంగా విద్యార్థులు పడుతున్న బాధను చూసే సమస్య పరిష్కారానికి ఎలాగైనా ముందడుగు వేయాలన్న సంకల్పంతోనే శాంతియుత దీక్ష నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. సదరు సమస్య పరిష్కారం కోరుతూ గతంలో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు, పాలకులకు పలుమార్లు వినతి పత్రాలను సమర్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయినా కూడా వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించడం కోసం తాను ముందడుగు వేసి దీక్షను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
కోర్ట్, ఇంజక్షన్ ఆర్డర్లు ఇప్పుడు ఏమయ్యాయి..?
పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని గతంలో జిహెచ్ఎంసి అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తే కోర్టు జోక్యం ఉందని, ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయని సంబంధిత అధికారులు సమస్యను దాటవేస్తూ వచ్చారని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిన్న ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి శాంతియుత దీక్షతో ఒక్కరోజులో ఆగమేఘాలమీద హైడ్రా, టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు ప్రహరీ గోడను కూల్చి వేశారని, ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్లు అధికారులకు అడ్డు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. దీన్నిబట్టి ఇంతకాలం అధికారులు కావాలనే సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేశారని స్పష్టం తెలుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఆమ్యామ్యాలకు అలవాటు పడి ప్రజా సమస్యలను గాలి వదిలేయడం సరికాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.