సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వీకెండ్ పార్టీలు… బర్త్ డే పార్టీలు చేసుకొని అర్ధరాత్రుల్లో ద్విచక్రవాహనాలు.. కార్లపై అతివేగంగా ప్రయణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు.. అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్‌తో శివారులోని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగానికి, మత్తు పదార్ధాల ప్రభావం కూడా తోడవుతుండడం ప్రమాదాలు జరుగుతున్నాయి. నగర శివారుల్లో ఫామ్‌హౌస్‌ల సంస్కృతి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ ఫామ్ హౌస్‌లు నేడు పబ్బులను తలదన్నేలా మారాయి, మద్యం, మత్తు ఇక్కడ యథేచ్ఛగా కొనసాగుతుంది.
ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1232 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 243 మంది మృతి చెందారు. అతివేగానికి సంబంధించిన ఘటనలలో 173 మంది ఉన్నారు. హైదరాబాద్ శివారులలోని ఘట్కేసర్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందగా తాజాగా యాచారం ఠాణా పరిధిలో కారు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో దాయాదులైన ఐదుగురు యువకులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. మృతి చెందిన వారిలో కొందరు వివాహమై భార్య, పిల్లలు కూడా ఉన్నారు.
శివారుల్లో రోడ్లు ఖాళీగా ఉండడం ఒకటైతే జాతీయ రహదారులు మరింత ఖాళీగా ఉండే అవకాశాలుంటాయి. దానికి తోడు భారీ వాహనాలు కూడా జాతీయ రహదారులపై వేగంగా వెళ్తుండడంతో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు అతివేగంగా వచ్చి కారును ఢీకొనడం, అదే బాధితుల కారు కూడా వేగంగా ఉండడంతో భారీ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. సాగర్ రహదారిపై డివైడర్ లేకపోవడంతో ఘోర ప్రమాదాన్ని చూడాల్సి వచ్చింది. ఇతర రహదారులలో చాలా వాటికి డివైడర్లున్నా సాగర్ రహదారికి తగిన డివైడర్లు లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. కాగా అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపొద్దంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, నిర్లక్ష్యాన్ని కొందరు వీడడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
శివారుల్లో రోజు రోజుకు ఫామ్ హౌస్‌లు పెరుగుతున్నాయి. ఫామ్‌హౌస్‌లను కిరాయికి ఇచ్చేందుకు చాలా మంది సోషల్‌మీడియాను వాడుకుంటున్నారు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు గ్రూప్ పార్టీలకు ఈ ఫామ్ హౌస్‌లను వాడుకుంటున్నారు. ఆయా గ్రామాలకు, నగరానికి దూరంగా ఈ ఫామ్ హౌస్‌లు ఉండడంతో అక్కడ పార్టీలతో యువత చిందులేస్తుంటారు.
కొందరు మద్యంతో మత్తులో ఉండగా మరికొందరు డ్రగ్స్‌ను కూడా తీసుకుంటూ మత్తులోకి వెళ్తున్నారు. నేడు శివారులలోని ఫామ్హౌస్లన్నీ పబ్బులను మించిపోతున్నాయి, ఫామ్ హౌస్లే పబ్బుగా మారడంతో అక్కడ మత్తులో మునిగితేలుతున్నారు. ఇక్కడ పార్టీలు చేసుకుంటూ మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. మద్యం, ఇతరాత్ర మత్తులో వాహనాలు నడుపవద్దని, ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు.