కొండాపూర్, ఆగస్టు 2: అతివేగంతో కారును నడిపి ఫ్లైఓవర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడలోని రహ్మత్‌నగర్‌కు చెందిన చరణ్ (19) ఇక్ఫాయ్ యూనివర్సిటీలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం తెల్లవారు జామున చరణ్ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఫిలింనగర్ మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. ఇదే క్రమంలో కారును అతివేగంతో నడుపుతూ, రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఉన్న షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన కారులో ఇరుక్కున్న చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి మామ మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.