
సిటీబ్యూరో, అగస్టు 12(నమస్తే తెలంగాణ): లైసెన్స్, డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా రోడ్లపై వాహనాలు నడిపితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తాజాగా నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నిదర్శనంగా నిలిచింది. రెండు రోజుల కిందట శంషాబాద్ శాతంరాయి ఏక్‌మీనార్ మసీద్ వద్ద ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఫిరోజ్ యూసుఫ్ మృతి చెందాడు. అందరూ అతి వేగమే అనుకున్నారు. అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఘటనను విశ్లేషించి సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో సబావత్ శివ నాయక్ అనే యువకుడు ఆ ప్రాంతంలో ద్విచక్రవాహనాన్ని అకస్మాతుగా మలుపు తిప్పి రోడ్డు పై వచ్చాడు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం బోల్తాపడింది. దర్యాప్తులో శివనాయక్‌కు లైసెన్స్ లేకపోవడంతో పాటు డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేదని తేలింది. దీంతో సబావత్ శివ నాయక్, అతడికి ద్విచక్రవాహనం ఇచ్చిన యజమాని జయేందర్పై 304 పార్ట్ 2(హత్య చేయాలని ఉద్దేశం లేదు..చేసే చర్య వల్ల ప్రాణం పోతుందని తెలిసి) కింద అభియోగాలను నమోదు చేశారు. శివ నాయక్‌ను అరెస్టు చేయగా…జయేందర్ పరారీలో ఉన్నాడు.