బడంగ్‌పేట, ఫిబ్రవరి 10: నగర శివారుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మహేశ్వరం ఇన్స్పెక్టర్ మధుసూదన్ కథనం ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు(35), యాదయ్య(34), శ్రీను (30), లింగారెడ్డి గ్రామానికి చెందిన రామస్వామి (32) వంట పనులు చేస్తుంటారు. శుభకార్యాలకు వెళ్లి వంటలు చేస్తారు. గురువారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లిన ఈ నలుగురు.. పనులు ముగించుకొని తిరిగి రాత్రి కారులో ఇంటికి బయలుదేరారు. మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు సమీపంలో వీరు కారులో వెళ్తుండగా… వేగంగా దూసుకువచ్చిన డీసీపీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడి మరణించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని శ్రీశైలం హైవేపై మృతుల కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. డీసీఎం డ్రైవర్ షేక్ జానీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిన్నట్లు పోలీసులు తెలిపారు. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.
తుమ్మలూరు గేటు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు, పక్క గ్రామానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందడంతో ఆ గ్రామాలు శోక సంద్రంలో మునిగాయి. ప్రమాదం జరిగిన స్థలానికి గురువారం రాత్రి కుటుంబ సభ్యులు, పోతేపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి.. మృతదేహాలను చూసి బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. దీంతో పోతేపల్లి గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది.