
సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రెడ్ సిగ్నల్ పడిపోతున్నది.. దాని దాటేద్దాం..అని ముందు ఎవరున్నారో చూసుకోకుండానే కారును పోనిచ్చాడు.. ఆ తొందరపాటే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆదివారం ఉదయం మాదాపూర్ సీఐఐ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇదే కారణమని సైబరాబాద్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నేరేడ్మెట్కు చెందిన అజయ్, జెన్నిఫెర్ మరియా డిక్రూజ్ కలిసి మాదాపూర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ శుభకార్యానికి హాజరై మరుసటి రోజు ఉదయం ఇంటికి బయలుదేరారు.
సీఐఐ జంక్షన్ వద్దకు రాగానే..రెడ్ సిగ్నల్ పడుతున్న క్రమంలో ఆగిపోయారు. అదే సమయంలో వీరి వెనకాల వస్తున్న సృజన్ అనే వ్యక్తి గ్రీన్ సిగ్నల్ పోయి.. రెడ్ లైట్ పడుతుందనే తొందర్లో తన కారును వేగాన్ని పెంచి ముందుకు సాగాడు. అప్పటికే అజయ్ తన ద్విచక్రవాహనాన్ని సిగ్నల్ కోసం ఆపేయడంతో గమనించని సృజన్.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. బైక్ వెనకాల కూర్చున్న జెన్నిఫర్ కిందపడిపోయి తల రోడ్డుకు తగిలి తీవ్రంగా గాయపడింది. అజయ్‌కు కూడా గాయాలయ్యాయి.
ఇద్దరిని స్థానిక దవాఖానకు తరలించగా జెన్నిఫర్ మృతి చెందింది. అజయ్ చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన జెన్నిఫర్ కుటుంబంతో పాటు కాబోయే భర్త కుటుంబంలో విషాదాన్ని నింపింది. మరో వైపు కారును నడిపించిన బీటెక్ విద్యార్థి సృజన్ కూడా చట్టపరంగా దొరికిపోయాడు. అతడి భవిష్యత్‌కు ఈ తప్పు పెద్ద అడ్డంకిగా మారనున్నది. అంతకుముందు సృజన్ శనివారం రాత్రి స్నేహితులతో కలిసి మాదాపూర్‌లో దావత్ చేసుకుని.. కూకట్‌పల్లిలోని తన ఇంటికి మాదాపూర్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసు దర్యాప్తులో తేలింది.
సృజన్ ప్రమాదం జరిగిన తర్వాత కారును అక్కడే వదిలేసి పారిపోగా, పోలీసులు గాలించి..అర్ధరాత్రి పట్టుకున్నారు. ఆ సమయంలో అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా జీరో వచ్చింది. మరోవైపు రోడ్డు ప్రమాద ఘటనపై సీసీ కెమెరాలతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సృజన్ నడిపించిన వాహనంపై దాదాపు 10కి పైగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన చలాన్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
సిగ్నల్ జంక్షన్ల వద్ద తొందరపాటు వద్దని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. సిగ్నల్‌ను పూర్తిగా పరిశీలించుకోవాలని, గ్రీన్ పోయి ఎల్లో లైట్ రాగానే ఆగిపోవాలంటున్నారు. అంతేతప్ప.. రెడ్‌లైట్ పడడానికి ఇంకా సమయం ఉంది కదా అని…యెల్లో వెలుగగానే త్వరగా దాటేద్దామని ప్రయత్నించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.