
హిమాయత్‌నగర్, ఆగస్టు 28: చిన్న నిర్లక్ష్యం చాలు.. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి. నారాయణగూడ పీఎస్ పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. అతను హెల్మెట్ ధరించినా.. బెల్టు పెట్టుకోలేదు. కనీస జాగ్రత్త పాటించి ఉంటే.. ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉండేదని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లో ఉండే గోనే ప్రదీప్‌కుమార్ (34) బాచుపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, మూడేండ్ల పాప ఉన్నారు. రోజులాగే శనివారం ఉదయం 5 గంటల సమయంలో డ్యూటీ కోసం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
హిమాయత్‌నగర్ ప్రధాన రహదారి బస్టాప్ సమీపంలోకి రాగానే శంకర్‌పల్లికి వెళ్తున్న లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రదీప్ లారీ వెనుక టైర్ల కింద పడిపోవడంతో హెల్మెట్ ఎగిరిపడింది. తల ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. హెల్మెట్ ధరించినప్పటికీ దానికి బెల్టు పెట్టుకోకపోవడంతోనే ఈ ప్రమాదంలో ప్రదీప్ మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు. లారీ డ్రైవర్ రాములును అరెస్ట్ చేశారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంధ్య తెలిపారు.