ఖైరతాబాద్, డిసెంబర్ 18 : సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలో అవినీతి 50శాతం మాత్రమే నిర్మూలన జరిగిందని, విద్యార్థులు, మేథావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు మిగతా 50శాతం నిర్మూలించేలా పాటుపడాలని రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ‘సుపరిపాలన దిశలో తెలంగాణ – సవాళ్లు – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సోమవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో 2005లో నాటి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఉపయోగించుకోలేకపోతున్నారని చెప్పారు. కేంద్ర పభుత్వం చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలోని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమాచార హక్కు చట్టాన్ని పకడ్బండీగా అమలు చేయాలని ఆదేశించారని, ఆన్లైన్లో అప్లికేషన్ కోసం ఓ జీవోను కూడా తీసుకువచ్చారని అన్నారు. అధికారులు, మంత్రులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని హామీలు, గ్యారంటీలు, ఆర్థిక కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎస్కే కరీం, న్యాయవాది శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.