బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 9: ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, క్యాజువాలిటి లాంటి ముఖ్య ప్రదేశాల్లో ‘ఇన్ఫెక్షన్ నియంత్రణ’ పట్ల జాగ్రతలు తీసుకోవాలని అదనపు డీఎంఈ, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు అన్నారు. గురువారం కాన్ఫరెన్స్ హాల్లో ‘ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ’ ఆధ్వర్యంలో అన్ని విభాగాల హెచ్ఓడీలు, ఆర్ఎంఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
దవాఖానలోని ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఎమర్జెన్సీ చికిత్సా విభాగాల వద్ద హానికారక బ్యాక్టీరియాను నివారించాలని, అలాంటి ప్రదేశాల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోగులకు హానికారక యాంటి బయోటిక్స్ ఎక్కువగా ఇవ్వకూడదని వైద్యులకు సూచించారు. బయో మెడికల్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేయాలని చెప్పారు. దవాఖానలో శుభ్రత పాటించాలని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేన్ ద్వారా ఫొటోలను ప్రదర్శించి, ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శోభన్‌బాబు, ఆర్ఎంఓ డాక్టర్ జయకృష్ణ, హెచ్ఓడీలు పాల్గొన్నారు.