ఖైరతాబాద్, జనవరి 25 : ముషీరాబాద్‌లోని హెబ్రాన్ చర్చిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రెవరెండ్ జోయల్ జాన్ స్టీవార్డ్ రిచర్డ్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబురావుతో కలిసి మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 31న ముషీరాబాద్‌లోని హెబ్రాన్ చర్చిపై వంద మంది గుండాలు దాడి చేయడంతో పాటు చర్చి నిర్వాహకులను కొట్టారన్నారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావుకు సైతం గాయాలయ్యాయన్నారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజీలు, డీవీఆర్‌లను ధ్వంసం చేశారన్నారు. కొందరు ఫేక్ సొసైటీ ట్రస్ట్ పేరుతో చర్చికి సంబంధించిన కోట్లాది రూపాయలను దోచుకున్నారని చెప్పారు.
వీరాచారి అతని అనుచరులే ఈ దాడుల వెనుక ఉన్నారని, ఇప్పటికే వారిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎడ్వార్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.